క్షేత్రంలో తొలిసారి వేడుక
ద్వారకాతిరుమల: చిన్నవెంకన్నకు చెల్లెలుగా.. క్షేత్ర దేవతగా వెలుగొందుతున్న శ్రీ కుంకుళ్లమ్మ అమ్మ వారికి దేవస్థానం అధికారులు బుధవారం తొలిసారిగా ఆషాఢ సారెను అత్యంత వైభవంగా సమర్పించారు. భక్తి, సంప్రదాయం, ఆధ్యాత్మిక శోభ కలగలిసిన ఈ వేడుక భక్తులకు నేత్రపర్వమైంది. ముందుగా ఆలయ ఈఓ వేండ్ర త్రినాథరావు, భాగ్యలక్ష్మి దంపతులు, పలువురు ఆలయ ట్రస్ట్‌బోర్డు సభ్యులు, పెద్ద సంఖ్యలో మహిళా భక్తులు శ్రీవారి పాదుకా మండపం వద్ద నుంచి పట్టు చీర, పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, వివిధ రకాల స్వీట్లతో కూడిన సారె పళ్లాలను శిరస్సుపై పెట్టుకుని మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా శ్రీ కుంకుళ్లమ్మ అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన అమ్మ వారి ఉత్సవ మూర్తికి సారెను సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు, పండితులు వేదమంత్రోచ్ఛరణల నడుమ విశేష పూజలు చేసి, హారతులు సమర్పించారు. ఆ తరువాత ఈఓ దంపతులు, ట్రస్ట్‌బోర్డు సభ్యులు గర్భాలయంలో కొలువైన శ్రీ కుంకుళ్లమ్మ అమ్మవారిని దర్శించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఈఓ మాట్లాడుతూ రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు ప్రారంభించిన ఈ ఆషాఢ సారె సమర్పణ కార్యక్రమాన్ని ఇకపై ప్రతి ఏడాది సంప్రదాయబద్ధంగా, మరింత వైభవంగా నిర్వహిస్తామని తెలిపారు. వచ్చేనెల 12 వరకు జరిగే ఈ కార్యక్రమాల్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారికి సారెను సమర్పించాలని ఆయన కోరారు. వేడుకలో ట్రస్ట్‌బోర్డు సభ్యులు చింతమనేని హనుమంతరావు, చలువాది శివకృష్ణ బ్రహ్మయ్య, కాకి సురేష్ కుమార్, కంపసాటి నాగ సీత, కడియం సత్యవతి తదితరులున్నారు.


