లక్ష్యానికి దూరం.. మిషన్‌ సక్షం | - | Sakshi
Sakshi News home page

లక్ష్యానికి దూరం.. మిషన్‌ సక్షం

Jul 29 2026 12:58 AM | Updated on Jul 29 2026 12:58 AM

బుట్టాయగూడెం: అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే పిల్లల్లో చదువులపై ఆసక్తి పెంచి, పోషకాహారం అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘మిషన్‌ సక్షం’ అంగన్‌వాడీ పథకం క్షేత్రస్థాయిలో తూతూమంత్రంగా మారుతోందని పలువురు విమర్శిస్తున్నారు. పిల్లల భవిష్యత్తు కోసం ఏర్పాటు చేసిన ఈ పథకం తన లక్ష్యాలను చేరుకోలేకపోతోందని నిపుణులు అంటున్నారు. పథకం అమలును ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే వాస్తవాలు వెలుగు చూసి, పథకం తన లక్ష్యాన్ని సాధిస్తుందని పలువురు కోరుతున్నారు.

టీవీలు ఇచ్చారు.. నెట్‌ కనెక్షన్‌లు లేవు

మిషన్‌ సక్షం అంగన్‌వాడీ కేంద్రాలుగా ఎంపిక చేసిన చోట విద్యార్థులకు డిజిటల్‌ పాఠాలు బోధించే విధంగా ప్రభుత్వం టీవీలను ఇచ్చింది. అయితే ఆ టీవీలకు కేబుల్‌ కనెక్షన్‌లు ఇవ్వలేదు. దీంతో అంగన్‌వాడీ కార్యకర్తలు సెల్‌ఫోన్‌ డేటా, పెన్‌డ్రైవ్‌ల సహాయంతో టీవీల్లో వీడియోలను పిల్లలకు చూపిస్తూ విద్యాబోధన చేస్తున్నారు. మారుమూల గ్రామాల్లో సెల్‌ఫోన్‌ సిగ్నల్‌ సరిగ్గా లేకపోవడంతో కేవలం పెన్‌డ్రైవ్‌లతోనే పాఠాలు బోధించే పరిస్థితి నెలకొంది. అంగన్‌వాడీ కార్యకర్తలు తమ సొంత సెల్‌ఫోన్లను రీచార్జ్‌ చేసుకుని ఇంటర్నెట్‌ వినియోగించి బోధించడం భారంగా మారుతోందని ఆరోపిస్తున్నారు.

నీళ్ల కోసం అవస్థలు

సక్షం అంగన్‌వాడీలుగా ఎంపిక చేసిన కేంద్రాల్లో పిల్లలకు సురక్షిత మంచినీరు అందించడం కోసం వాటర్‌ ఫిల్టర్లను అందజేశారు. అయితే అవి చాలా చోట్ల నిరుపయోగంగానే ఉన్నాయి. నీటి సదుపాయం కోసం ఏర్పాటు చేసిన మోటర్లు కొన్నిచోట్ల పాడైపోగా, మరికొన్ని చోట్ల అసలు మోటర్లే బిగించకపోవడంతో చిన్నారులు మంచినీటి కోసం చేతిపంపుల వద్దకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తోందని తల్లిదండ్రులు వాపోతున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి టీవీలకు కేబుల్‌ కనెక్షన్లు ఏర్పాటు చేయించడంతోపాటు, పాడైపోయిన మోటర్లకు మరమ్మతులు చేయించి, నిరుపయోగంగా ఉన్నవాటిని వినియోగంలోకి తీసుకురావాలని కోరుతున్నారు.

69 కేంద్రాల ఎంపిక

బుట్టాయగూడెం ఐసీడీఎస్‌ ప్రాజెక్టు పరిధిలో మొత్తం 189 అంగన్‌వాడీ కేంద్రాలు ఉండగా అందులో 69 కేంద్రాలను ప్రభుత్వం మిషన్‌ సక్షం అంగన్‌వాడీ కేంద్రాలుగా ఎంపిక చేసింది. ఆయా కేంద్రాల్లో చదువుతున్న పిల్లలకు నాణ్యమైన విద్య, ఆరోగ్యం, పోషణ అందించడంతోపాటు క్షేత్రస్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రతి కేంద్రానికి ఒక టీవీ, వాటర్‌ ఫిల్టర్‌, బ్లాంకెట్లు, మెస్‌ స్టాండ్‌, ఆట వస్తువులు, 15 పిల్లల కుర్చీలు, 2 పెద్ద కుర్చీలు ఇచ్చారు. అలాగే వాటర్‌ ట్యాంక్‌ ఏర్పాటుతోపాటు మోటర్‌ కూడా బిగించి మంచినీటి సదుపాయం కల్పించాలని పథకంలో పొందుపరిచారు. అయితే, ఎంపికై న అంగన్‌వాడీ కేంద్రాల్లో 60 శాతానికి పైగా ఈ పథకం నీరుగారిపోయేలా ఉందని అటు గ్రామస్తులు, ఇటు విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఎంపికై న అన్ని కేంద్రాల్లో పథకం సక్రమంగా అమలయ్యేలా ఉన్నతాధికారులు తగిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

అంగన్‌వాడీ కేంద్రాల్లో టీవీలకు లేని నెట్‌ కనెక్షన్‌

పెన్‌ డ్రైవ్‌లు, సెల్‌ఫోన్‌ డేటాలతో వీడియోలు చూపిస్తున్న వైనం

సురక్షిత నీటి కోసం విద్యార్థుల అవస్థలు

తూతూమంత్రంగా పథకం అమలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement