కొయ్యలగూడెం: రాజవరం పంచాయతీ పరిధిలో కొనసాగుతున్న అక్రమ తవ్వకాలపై కలెక్టర్‌కి ఫిర్యాదు చేసినట్లు గ్రామస్తులు మంగళవారం పేర్కొన్నారు. గంగవరం గ్రామ రెవెన్యూ పరిధిలో గ్రావెల్, మట్టి, ఎర్ర కాలువలోని ఇసుక అక్రమ తవ్వకాల గురించి సాక్ష్యాధారాలతో సహా కలెక్టర్ వెట్రిసెల్వికి ఏలూరు వెళ్లి సమర్పించినట్లు తెలిపారు. మైనింగ్ శాఖ అధికారులకు అనేకసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ వారు చర్యలు తీసుకోలేదని, ఎప్పటికప్పుడు వస్తామంటూ దాటవేస్తున్నారని ఆరోపించారు. దీంతో అక్రమార్కులు మరింత రెచ్చిపోయి రేయింబవళ్లు అక్రమతోలకాలు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై తగిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చినట్లు రైతులు తెలిపారు.
పోలవరం రూరల్: పోలవరం ప్రాజెక్టు గ్యాప్ –2 ప్రాంతంలో సీఫేజ్ నిల్వ ఉన్న ప్రదేశంలోని గొయ్యిలో ప్రమాదవశాత్తు గల్లంతైన ఎక్స్‌వేటర్ ఆపరేటర్ నాగేశ్వరరావు మృతదేహం వెలికి తీశారు. సోమవారం ఉదయం గల్లంతైన మృతదేహాన్ని గాలింపు చర్యలు చేపట్టి సోమవారం రాత్రి వెలికితీసినట్లు పేర్కొన్నారు. మృతదేహాన్ని పోలవరం మార్చురీకి తరలించి, పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించినట్లు ఎస్సై పి.అప్పారావు తెలిపారు.
చింతలపూడి (జంగారెడ్డిగూడెం): ఉపాధ్యాయుల వేధింపులు తాళలేకే తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని తల్లి పద్మ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం రాజులకాలనీకి చెందిన కునుపోటు బాలసాయి సుబ్రహ్మణ్యం అలియాస్ బన్ను (16) రావికంపాడు జెడ్పీహెచ్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. ఈ నెల 3న జుట్టు సరిగా లేదనే కారణంతో ఉపాధ్యాయులు అతడిని కొట్టారు. నాటి నుంచి హెచ్‌ఎంతో పాటు కొందరు ఉపాధ్యాయులు, విద్యార్థులు అతడిని మానసికంగా వేధిస్తున్నారని, తోటి విద్యార్థుల ముందు బ్యాగ్ వెతికించి అవమానించారని తల్లి తెలిపింది. దీంతో మనస్తాపం చెందిన బన్ను ఈ నెల 26న ఇంట్లో ఉరివేసుకున్నాడు. ఈ మేరకు ఎస్సై వీరప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఏలూరు టౌన్: ఏలూరు రైల్వే పోలీస్‌స్టేషన్ పరిధిలోని పెద్దపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో రైలు నుంచి జారిపడి ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. మృతుడు బిస్కెట్ కలర్ ప్యాంట్, పసుపు రంగు బనియన్ ధరించి ఉన్నాడు. రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని ఏలూరు సర్వజన ఆసుపత్రి మార్చురీకి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఉండి: ఖాతాదారుడి ప్రమేయం లేకుండా సేవింగ్స్ ఖాతా నుంచి రూ.1.25 లక్షలు మాయమైన సంఘటనపై మంగళవారం కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం యండగండికి చెందిన శృంగవృక్షం ఆంజనేయులు విస్సాకోడేరులో ఆర్‌ఎంపీగా పనిచేస్తున్నాడు. ఆయనకు యండగండి యూనియన్ బ్యాంకులో ఖాతా ఉంది. ఈ ఏడాది మే 11న ఆయన ప్రమేయం లేకుండానే ఖాతా నుంచి రూ.1,25,295 డ్రా అయినట్లు గుర్తించాడు. బ్యాంకు అధికారులను ఆరా తీయగా ఇది ఆన్‌లైన్ లావాదేవీ అని, తమకేమీ సంబంధం లేదని సమాధానమిచ్చారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఉండి ఎస్సై మల్లికార్జునరావు ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


