భక్తుడి నగదు చోరీ చేసిన ముఠా అరెస్టు | - | Sakshi
Sakshi News home page

భక్తుడి నగదు చోరీ చేసిన ముఠా అరెస్టు

Jul 29 2026 12:58 AM | Updated on Jul 29 2026 12:58 AM

భక్తుడి నగదు చోరీ చేసిన ముఠా అరెస్టు పోలవరం ప్రమాద మృతుల కుటుంబాలను ఆదుకోవాలి

ద్వారకాతిరుమల: శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తుడి వద్ద రూ. లక్ష నగదు చోరీకి గురైన కేసును ద్వారకాతిరుమల పోలీసులు వేగంగా ఛేదించారు. సాంకేతిక ఆధారాలు, సీసీ కెమెరా ఫుటేజ్‌ ఆధారంగా ఇద్దరు నిందితులను అరెస్టు చేసి, వారి నుంచి రూ. 80 వేల నగదు, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలను ఎస్సై టి. సుధీర్‌ మంగళవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఏలూరు మండలం సుంకరివారి తోటకు చెందిన గూరుగుబెల్లి రమణమూర్తి తన భార్యతో కలిసి ఈ నెల 25న తొలి ఏకాదశి సందర్భంగా ద్వారకాతిరుమల వచ్చారు. ఆ సమయంలో ఆయన వద్ద ఉన్న రూ. లక్ష నగదు చోరీకి గురైంది. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు, జిల్లా ఎస్పీ కె. ప్రతాప్‌ శివకిషోర్‌ ఆదేశాలు, అడిషనల్‌ ఎస్పీ వై. ప్రసాదరావు, ఏలూరు డీఎస్పీ డి. శ్రావణ్‌ కుమార్‌ పర్యవేక్షణలో భీమడోలు సీఐ పి. కృష్ణ నేతృత్వంలో దర్యాప్తు చేపట్టారు. సీసీ ఫుటేజ్‌ ఆధారంగా ముగ్గురు సభ్యుల ముఠాను గుర్తించిన పోలీసులు నూజివీడుకు చెందిన బొంకూరు కుమార్‌, శీలం రాజులను అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మరో నిందితుడిని త్వరలోనే అరెస్ట్‌ చేసి, మిగిలిన రూ. 20 వేల నగదును రికవరీ చేస్తామని ఎస్సై తెలిపారు. చాకచక్యంగా కేసును ఛేదించిన పోలీసు బృందాన్ని ఉన్నతాధికారులు అభినందించారు. ఈ సందర్భంగా పుణ్యక్షేత్రాలు, రద్దీ ప్రాంతాల్లో భక్తులు తమ నగదు, విలువైన వస్తువుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్సై సూచించారు.

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): పోలవరం పనుల్లో మృతి చెందిన ఆపరేటర్‌ టి. నాగేశ్వరరావు, యంగ్‌ ఇంజనీర్‌ కోడూరు రవికాంత్‌ కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని సీపీఎం ఏలూరు జిల్లా కార్యదర్శి ఆర్‌. లింగరాజు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఎర్త్‌ కమ్‌ రాక్‌ ఫిల్‌ డ్యామ్‌ నిర్మాణ ప్రాంతంలో నీటిలో మునిగిపోయిన యంత్రాన్ని తాడుతో బయటకు లాగే ప్రయత్నంలో వారు నీట మునిగి చనిపోయినట్లు తెలిపారు. మృతుడు నాగేశ్వరరావు (తూర్పు గోదావరి జిల్లా, సీతానగరం మండలం, చిన్న కొండేపూడి)కి భార్య, నలుగురు కుమార్తెలు ఉన్నారని, పెద్ద కుమార్తె 10వ తరగతి చదువుతోందని వివరించారు. మరో మృతుడు రవికాంత్‌కు వివాహం చేసేందుకు తల్లిదండ్రులు ఏర్పాట్లు చేస్తున్న సమయంలో ఈ విషాదం చోటుచేసుకుందని వాపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement