ప్రతి అర్జీకీ శాశ్వత పరిష్కారం చూపాలి | - | Sakshi
Sakshi News home page

ప్రతి అర్జీకీ శాశ్వత పరిష్కారం చూపాలి

Jul 29 2026 12:58 AM | Updated on Jul 29 2026 12:58 AM

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, ప్రభుత్వ ఫలాలు నిరుపేద, మధ్యతరగతి కుటుంబాలతో పాటు ప్రతి గడపకూ అందేలా అధికారులు చూడాలని 20 సూత్రాల కార్యక్రమ అమలు కమిటీ చైర్మన్‌ లంకా దినకర్‌ ఆదేశించారు. మంగళవారం ఏలూరు కలెక్టరేట్‌లో ఆయన ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, అధికారులు సమన్వయంతో వాటికి శాశ్వత పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు.

ప్రతి ఇంటికీ కుళాయి కనెక్షన్‌ ఇవ్వాలి

అనంతరం కలెక్టరేట్‌లో వికసిత్‌ భారత్‌–స్వర్ణాంధ్ర లక్ష్యాలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుపై అధికారులతో ఆయన సమీక్షించారు. జల్‌ జీవన్‌ మిషన్‌, అమృత్‌ పథకాల ద్వారా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో శాశ్వత నీటి వనరులను గుర్తించి ప్రతి ఇంటికీ కుళాయి కనెక్షన్‌ ఇవ్వాలన్నారు. పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా విద్యార్థులు, గర్భిణులు, బాలింతలకు సంపూర్ణ పోషకాహారం అందించాలని, విద్యార్థులకు రక్తహీనత లేకుండా వైద్య పరీక్షలు చేయాలని సూచించారు. కొల్లేరులో జిరాయితీ రైతుల హక్కులు కాపాడుతూనే, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు. మత్స్యకారుల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేలా రూపొందించిన కార్యాచరణ నివేదికను జిల్లా యంత్రాంగం కేంద్ర సాధికార కమిటీకి పంపిందన్నారు.

‘సూర్యఘర్‌’ అమలులో జిల్లా ప్రథమం

కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ ప్రధానమంత్రి సూర్యఘర్‌ పథకం అమలులో ఏలూరు జిల్లాను రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిపామన్నారు. పీఎంజీఎస్‌వై పథకం కింద రూ.437 కోట్లతో 427 కిలోమీటర్ల మేర గ్రామీణ రోడ్ల నిర్మాణం చేపడుతున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కామినేని శ్రీనివాస్‌, చింతమనేని ప్రభాకర్‌, సొంగా రోషన్‌ కుమార్‌, జేసీ ఎంజే అభిషేక్‌ గౌడ, ఏపీ వడ్డీ కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ ఘంటసాల వెంకటలక్ష్మి, డీఆర్వో ఎం శ్రీదేవి, జెడ్పీ సీఈఓ పి.జగదాంబ, ఆర్డీఓ కె.లక్ష్మీప్రసన్న, అటవీశాఖ అధికారి పీవీ సందీప్‌రెడ్డి, నగరపాలక సంస్థ కమిషనర్‌ భాననుప్రతాప్‌ తదితరులు పాల్గొన్నారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement