ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జిల్లాలో అధికంగా ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్స్ను గుర్తించి, వాటి నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కే. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో జిల్లా ఎస్పీ కే. ప్రతాప్ శివకిషోర్‌తో కలిసి రహదారి భద్రతా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గత ఏడాదితో పోలిస్తే ప్రమాదాలు, మరణాలు తగ్గినప్పటికీ, 304 రోడ్డు ప్రమాదాల్లో 149 మంది మృతి చెందడం ఆందోళనకరమన్నారు. అతివేగం, హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించకపోవడమే మరణాలకు ప్రధాన కారణాలని, ప్రమాదాల నివారణపై విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ మాట్లాడుతూ పాఠశాల బస్సుల్లో తప్పనిసరిగా డాష్ కెమెరాలు అమర్చాలని, జాతీయ రహదారిపై నిలుపుదల చేసే వాహనాలతో పాటు అతివేగంతో వెళ్లేవాటిపై కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. రవాణా శాఖ ఉప కమిషనర్ షేక్ కరీమ్ గత సమావేశ నిర్ణయాలపై తీసుకున్న చర్యలను వివరించారు. సమావేశంలో ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్, ఆర్టీఓ ఎస్‌బీ శేఖర్, డీపీఓ మల్లికార్జునరావు, నగరపాలక సంస్థ కమిషనర్ ఎ.భానుప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.


