ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ప్రజల సమస్యలను త్వరితగతిన, పారదర్శకంగా పరిష్కరించడమే లక్ష్యమని జిల్లా ఎస్పీ కేపీ శివకిషోర్ అన్నారు. ఏలూరు జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఆర్)లో అదనపు ఎస్పీ (అడ్మిన్) వై.ప్రసాదరావుతో కలిసి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. వారి సమస్యలు తెలుసుకుని చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. మొత్తంగా 62 ఫిర్యాదులు అందాయని, వీటిలో ప్రధానంగా భూ వివాదాలు, కుటుంబ తగాదాలు, ఆర్థిక మోసాలు తదితర అంశాలకు సంబంధించిన ఫిర్యాదులు ఉన్నాయన్నారు. దూర ప్రాంతాల నుంచి ప్రజలు జిల్లా పోలీసు కార్యాలయానికి రావాల్సిన అవసరం లేకుండా, తమ సమీపంలోని సబ్ డివిజన్ లేదా సర్కిల్ కార్యాలయాల్లోనే ఫిర్యాదులు నమోదు చేసుకోవచ్చని తెలిపారు. ఫిర్యాదుదారులకు ఏలూరు శ్రీ సత్యసాయి సేవా సమితి ప్రతినిధులు భోజన సదుపాయం కల్పించారు.


