భీమవరం: కార్గిల్ అమరవీరుల త్యాగాల సువర్ణాక్షరాలతో చిరస్థాయిగా నిలిచిపోతాయని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమలశాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా భీ మవరంలో జిల్లా యువమోర్చా ఆధ్వర్యంలో వీర జవాన్లకు ఘన నివాళులర్పించారు. మాజీ సైనికులను మంత్రి సత్కరించారు. అనంతరం పట్టణంలో భారీ కాగడాల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాసవర్మ మాట్లాడుతూ దేశ సరిహద్దులను కాపాడేందుకు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన అమరవీరుల త్యాగాలు స్ఫూర్తిదాయకమన్నారు. అమర జవాన్ల స్ఫూర్తితో యువత నవభారత నిర్మాణానికి పునరంకితం కావాలని కోరారు. బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి, జిల్లా ప్రధాన కార్యదర్శి కలిదిండి వినోద్ వర్మ, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు గోపాల్ పాల్గొన్నారు.


