కళారూపాలు కనుమరుగు | - | Sakshi
Sakshi News home page

కళారూపాలు కనుమరుగు

Jul 27 2026 12:54 AM | Updated on Jul 27 2026 12:54 AM

ప్రభుత్వాలు ప్రోత్సహించాలి

గుర్తింపు కార్డులు ఇచ్చి ఆదుకోవాలి

దయనీయ స్థితిలో కళాకారులు

సంచార జాతులకు ప్రోత్సాహం కరువు

పాలకోడేరు: సంస్కృతి అంటే ఆలయాలు, పండుగలతో పాటు కళారూపాలు కూడా. తెలుగు నేలకు ప్రాణం పోసిన జానపద కళలు ఆధునికత దెబ్బకు ఒక్కొక్కటిగా కనుమరుగవుతున్నాయి. ఫలితంగా మన గుర్తింపు, సాంస్కృతిక వారసత్వం ప్రమాదంలో పడుతున్నాయి.

కాలగర్భంలో కలుస్తున్న ‘బుడబుక్కల’ కళ

ఒకప్పుడు తెల్లవారుజామునే ఊరూరా డమరుకం మోగిస్తూ, శ్రీఅంబ పలుకు జగదంబ పలుకుశ్రీ అంటూ ప్రజలను మేల్కొలిపే శ్రీబుడబుక్కలశ్రీ వారు గ్రామీణ జీవనంలో అంతర్భాగంగా ఉండేవారు. రంగురంగుల దుస్తులతో శుభాశుభాలు చెప్తూ, జానపద గేయాల ద్వారా వినోదాన్ని, ఆధ్యాత్మిక సందేశాలను అందించేవారు. తోలుబొమ్మలాట, బుర్రకథ వంటి కళలతో పాటు ఈ రూపం కూడా పురాణ గాథలను, ఆచారాలను తరువాతి తరాలకు అందించేది.

ఆధునికత ప్రభావం.. కళాకారుల దయనీయ స్థితి

టీవీలు, స్మార్ట్‌ఫోన్లు, సోషల్‌ మీడియా వంటి ఆధునిక వినోద మాధ్యమాల విస్తరణతో సంప్రదాయ కళలకు ఆదరణ కరువైంది. జీవనోపాధి లేక, కొత్త తరం కూడా ఈ రంగం వైపు రాకపోవడంతో ఈ కళ అంతరించిపోయే దశకు చేరింది. ప్రస్తుతం ఈ కళాకారులు స్థిర నివాసం లేక గుడారాల్లో నివసిస్తూ చిత్తు కాగితాలు ఏరుకోవడం, పూసల దండలు అమ్మడం లేదా యాచక వృత్తి ద్వారా పొట్టపోసుకుంటున్నారు. కాగితాలపై శ్రీబీసీ–ఏశ్రీ జాబితాలో ఉన్నప్పటికీ, దారిద్య్రరేఖకు దిగువన అత్యంత దయనీయ జీవితాన్ని గడుపుతున్నారు. వీరు తమను శ్రీఎస్టీశ్రీ జాబితాలో చేర్చాలని లేదా కనీసం అంత్యోదయ అన్నయోజన (రేషన్‌) కార్డులు మంజూరు చేసి ఆదుకోవాలని కోరుతున్నారు.

సంరక్షణకు తీసుకోవాల్సిన చర్యలు

● ఈ పురాతన సంప్రదాయాన్ని కాపాడుకోవడానికి ప్రభుత్వాలు, సాంస్కృతిక సంస్థలు తక్షణమే స్పందించాలి.

● వృద్ధులకు, కళాకారులకు క్రమం తప్పకుండా పింఛన్లు, ఆర్థిక ప్రోత్సాహకాలు అందించాలి.

● కొత్త తరానికి ఈ కళలను నేర్పించేందుకు ప్రత్యేక శిక్షణా శిబిరాలు ఏర్పాటు చేయాలి.

● పాఠశాల పాఠ్యంశాల్లో, సాంస్కృతిక ఉత్సవాల్లో జానపద కళలకు ప్రాధాన్యమిచ్చి యువతలో అవగాహన పెంచాలి.

● జానపద కళలను కాపాడుకోవడం అంటే మన అస్తిత్వాన్ని, మూలాలను కాపాడుకోవడమే.

బుడబుక్కలు, దొమ్మరి, తోలు బొమ్మలాట వారు సంచార, అర్ధ సంచార, విముక్తి జాతులుగా పిలవబడుతున్నారు. వీరికి తరతరాలుగా అక్షర జ్ఞానం లేకపోయినా, భారత, భాగవత, రామాయణాలను ప్రజల్లో ప్రచారం చేస్తున్నారు. వీరిని గుర్తించి ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. అలాగే ఇల్లు, ఆహారం వంటి వసతులు కల్పించాలి. స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లయినా వీరంతా అన్ని రంగాల్లో దూరంగానే ఉన్నారు.

– చింతపల్లి గురుప్రసాద్‌, సంచార జాతుల రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు

సంచార జాతుల్లో ఉన్న కళాకారులను గుర్తించి, ప్రభుత్వం ప్రోత్సహించాలి. కార్పొరేట్‌ కబంధ హస్తాల్లో చిక్కుకున్న సాంస్కృతిక రంగానికి, సంచార జాతుల కళాకారులకు ప్రవేశం కల్పించి అసలైన కళారూపాలను ప్రజలకు అందించాలి. ఎన్నికల ముందు ఈ కళాకారులకు గుర్తింపు కార్డులు ఇస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చి రెండేళ్లయినా ఇంతవరకు ఆచరణకు నోచుకోలేదు.

– పెండ్ర వీరన్న, ఎంబీసీ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌, సంచార జాతుల వ్యవస్థాపక అధ్యక్షుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement