ఇన్‌స్టిట్యూట్ బాగానే నడుస్తోంది
● ఏకై క కేంద్రాన్ని పట్టించుకోని అధికారులు
● ప్రశ్నార్థకంగా విద్యార్థుల భవిష్యత్తు
ఉంగుటూరు: రాష్ట్రంలోనే ఏకై క మత్స్య శిక్షణా కేంద్రమైన బాదంపూడి మత్స్య శిక్షణా సంస్థ విద్యార్థులు లేక వెలవెలబోతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ, రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాల నుంచి భారీగా అభ్యర్థులు తరలివచ్చి ఇక్కడ శిక్షణ పొందేవారు. ఇక్కడ అందించే మూడు నెలల సర్టిఫికేట్ కోర్సు పూర్తి చేసిన వారు సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకుని, ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో విస్తృతంగా ఉద్యోగాలు సాధించారు.
శిక్షణ ఇలా
చేపల విత్తన (నారు) ఉత్పత్తి, చేపల రక్షణ, వ్యాధుల నివారణ చర్యలు, చెరువుల నిర్వహణ వంటి కీలకమైన అంశాలపై ఇక్కడ సమగ్ర శిక్షణ ఇస్తారు. గతంలో స్టైఫండ్‌తో 20 మంది, నాన్–స్టైఫండ్‌తో 20 మంది చొప్పున అభ్యర్థులకు హాస్టల్ వసతి కల్పిస్తూ శిక్షణనిచ్చేవారు. అయితే రాష్ట్ర విభజన తర్వాత నిర్వహణ లోపాలు, పర్యవేక్షణ కరవవ్వడం వల్ల ఈ కేంద్రం ప్రాధాన్యం క్రమంగా తగ్గుతూ వచ్చింది. దానికితోడు ప్రభుత్వం ఇస్తున్న స్టైఫండ్‌ను కూడా రద్దు చేయడంతో చేరే విద్యార్థుల సంఖ్య గణనీయంగా పడిపోయింది. ఈ ఏడాది కేవలం 12 మంది మాత్రమే చేరారు. తరగతులు క్రమబద్ధంగా జరగకపోవడం, బోధకులు తరచూ సెలవులు పెట్టడం వల్ల ఈ 12 మంది కూడా సరిగా రావడం లేదు. ఏళ్ల చరిత్ర కలిగిన ఈ కేంద్రం భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారినా ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
మత్స్య శిక్షణా కేంద్రం నిబంధనల ప్రకారమే నడుస్తోంది. ప్రస్తుతం 12 మంది విద్యార్థులు శిక్షణ పొందుతుండగా తరగతులు క్రమం తప్పకుండా జరుగుతున్నాయి. ఇన్‌స్టిట్యూట్ సరిగా తెరవడం లేదనే వార్తల్లో నిజం లేదు. విద్యార్థులు ప్రాక్టికల్స్ కోసం బయటకు వెళ్లినప్పుడు కేంద్రం ఖాళీగా కనిపిస్తుంది తప్ప, నిర్వహణలో ఎలాంటి లోపాలు లేవు.
– భార్గవి, నిర్వహణ అధికారి


