ఖర్జూరంలో పురుగులు.. పాడైపోయిన చిక్కీలు | - | Sakshi
Sakshi News home page

ఖర్జూరంలో పురుగులు.. పాడైపోయిన చిక్కీలు

Jul 26 2026 2:02 AM | Updated on Jul 26 2026 2:02 AM

సమస్యల సుడిగుండంలో..

సమస్యల సుడిగుండంలో..

కై కలూరు: కూటమి ప్రభుత్వ పాలనలో అంగన్‌వాడీ కేంద్రాల పనితీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చిన్నారులు, బాలింతలు, గర్భిణులకు పంపిణీ చేసే పోషకాహారంలో పురుగులు, బూజు వస్తున్నాయని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. దీనికితోడు ఐసీడీఎస్‌ అధికారులకు, అంగన్‌వాడీ కార్యకర్తలకు మధ్య తీవ్ర వ్యత్యాసాలు, అగాధం ఏర్పడుతోంది. పురుగులు పట్టిన ఖర్జూరాలను పంపిణీ చేస్తుండటంతో లబ్ధిదారులు తమ ముఖంపైనే విసిరికొడుతున్నారని అంగన్‌వాడీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఐవీఆర్‌ఎస్‌ కాల్స్‌లో వెల్లడవుతున్న అసంతృప్తి

కేంద్రాలకు సరఫరా అయ్యే వస్తువుల నాణ్యతపై ఐవీఆర్‌ఎస్‌ ఫోన్‌ కాల్స్‌ ద్వారా సమాచారం సేకరిస్తున్నారు. నాణ్యత బాగుంటే ‘1’, బాగోలేకపోతే ‘2’ నొక్కాలని అడగ్గా.. మెజారిటీ లబ్ధిదారులు నాణ్యత సరిగ్గా లేదనే (2) సమాధానమిస్తున్నారు. అయితే, ఐసీడీఎస్‌ సిబ్బంది సరుకుల నాణ్యతను మెరుగుపరచడం వదిలేసి, కార్యకర్తలపైనే మండిపడుతుండటం గమనార్హం.

కార్యకర్తలపైనే ఆర్థిక భారం : పెరిగిన ధరలతో జీవనం భారంగా మారిన తరుణంలో, ఐసీడీఎస్‌ కార్యాలయం చెల్లించాల్సిన ఖర్చులను కూడా తమపైనే రుద్దుతున్నారని కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారు. ఇటీవల పోషణ్‌ పక్వాడా ముగింపు వేడుకలకు కలెక్టర్‌ వెట్రిసెల్వి వచ్చారు. ఆ తర్వాత వచ్చిన అధికారులకు భోజనాలు, ఇతర పదార్థాల తయారీకి దాదాపు రూ.30 వేలు ఖర్చవగా, ఆ భారాన్ని తమపైనే వేశారని అంగన్‌వాడీలు తెలిపారు. కొత్త మెనూ చార్టుల ఫ్లెక్సీల కోసం ఒక్కో కేంద్రం నుంచి రూ.100 వసూలు చేస్తున్నారని, నిజానికి కై కలూరులో ఫ్లెక్సీ తయారీకి రూ.70 మాత్రమే ఖర్చవుతుందని వారు చెబుతున్నారు. అలాగే కై కలూరు ఓరియంటల్‌ స్కూల్‌లో జరిగిన ఒక్కరోజు శిక్షణకు సంబంధించిన భోజన ఖర్చులు రూ.270 ఇంకా చెల్లించలేదని, కేంద్రాల్లో నిర్వహించే టీబీ ఈవెంట్‌ బిల్లులను కూడా సకాలంలో మంజూరు చేయడం లేదని వాపోతున్నారు. నిలదీసి అడుగుతుంటే వేదింపులకు గురుచేస్తోన్నారని పేరు చెప్పడానికి ఇష్టపడని అంగన్‌వాడీ కార్యకర్త చెప్పారు.

కోడిగుడ్ల సైజుల్లో వ్యత్యాసాలు

చిక్కీలోపల బూజు

అంగన్‌వాడీ కేంద్రాల్లో పోషకాహారం ఇలా..

కోడిగుడ్డు సైజుల్లో వ్యత్యాసాలు

ఐవీఆర్‌ఎస్‌ కాల్స్‌లో సరుకులపై తీవ్ర వ్యతిరేకత

ఖర్చులు తమపై మోపుతున్నారని కార్యకర్తల ఆవేదన

జిల్లాలోని 10 ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల పరిధిలో 2,225 అంగన్‌వాడీ కేంద్రాలు పనిచేస్తున్నాయి. ఒక్క కై కలూరు నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో, 13 సెక్టార్ల పరిధిలో 311 కేంద్రాలు ఉన్నాయి. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అటుకులు, రాగిపిండి, బెల్లం, ఖర్జూరం, చిక్కి వంటి 6 రకాల పదార్థాలను అందిస్తున్నారు. వీటిలోని ఖర్జూరాల్లో తెల్లటి పురుగులు కనిపిస్తుండగా, చిక్కి బూజు పడుతోంది. నిబంధనల ప్రకారం ఒక్కో గుడ్డు 50 గ్రాములు ఉండాల్సి ఉండగా, చాలావరకు చిన్న సైజు గుడ్లే సరఫరా అవుతున్నాయి. రాగి జావ తయారీకి ఇచ్చే పిండిలో ఇసుక వస్తోంది. ఆన్‌లైన్‌ నమోదు ప్రకారమే రేషన్‌ ఇస్తున్నా, సరుకుల నాణ్యత లోపం వల్ల గ్రామాల్లో జనం తమను నిలదీస్తున్నారని అంగన్‌వాడీ టీచర్లు వాపోతున్నారు. వైఎస్సార్‌సీపీ పాలనలోనే సరుకుల నాణ్యత మెరుగ్గా ఉండేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. కూటమి నాయకుల మాట వినకపోతే తమపై వరుసగా ఫిర్యాదులు చేస్తూ వేధింపులకు గురిచేస్తున్నారని కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement