ఏలూరు టౌన్: వివాహేతర సంబంధాన్ని కొనసాగించవద్దని హెచ్చరించినా పట్టించుకోకుండా, తన వదినతో చనువుగా ఉంటున్నాడనే కోపంతో నాటు తుపాకీతో ఒక వ్యక్తిని హతమార్చేందుకు వేసిన కుట్రను చింతలపూడి పోలీసులు భగ్నం చేశారు. తీగ లాగితే డొంక కదిలినట్లు... ఈ హత్య ప్రయత్నంపై దర్యాప్తు చేయగా ఏకంగా నాటు తుపాకులు తయారు చేస్తున్న ముఠా పోలీసులకు చిక్కింది. ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. అనంతరం ఆయన నాటు తుపాకీలను, తయారీ సామగ్రిని పరిశీలించారు.
హెచ్చరించినా వినలేదని..
చింతలపూడి మండలం బట్టువారిగూడెం గ్రామానికి చెందిన సందక సాయిబాబు వదినతో, సుబ్బారాయుడుగూడెం గ్రామానికి చెందిన పల్నాటి మహేష్ చనువుగా ఉంటున్నాడు. వివాహేతర సంబంధం కొనసాగుతుందనే అనుమానంతో మహేష్‌ను మందలించినా అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. దీంతో చింతలపూడి మండలం తిమ్మారెడ్డిపల్లి గ్రామం ఎన్‌ఆర్‌టీఆర్ సెంటర్‌కు చెందిన తాళం వీరబాబు నుంచి సాయిబాబు ఒక నాటు తుపాకీ తీసుకున్నాడు. పల్నాటి మహేష్‌ను అంతం చేయాలనే ఉద్దేశంతో గణిజర్ల ప్రాంతంలోని ఆయిల్‌పాం తోట వద్ద రెండు రోజులుగా అదను కోసం వేచి ఉన్నాడు. ఈ నెల 24న సాయిబాబు, వీరబాబు ఇద్దరూ మోటారు సైకిల్‌పై గణిజర్ల వెళ్లి వస్తుండగా.. చింతలపూడి ఎస్సై తన సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో ఇద్దరూ అనుమానాస్పదంగా కనిపించడంతో తనిఖీ చేయగా, వారి వద్ద ఒక నాటు తుపాకీ, ఒక లైవ్ బుల్లెట్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
నాటు తుపాకుల తయారీ గుట్టురట్టు
జంగారెడ్డిగూడెం డీఎస్పీ బీహెచ్ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో చింతలపూడి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ టీ. క్రాంతికుమార్, ఎస్సై కే. సతీష్‌కుమార్ దర్యాప్తు చేపట్టారు. ఈ విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. నాటు తుపాకీ కలిగి ఉన్న వీరబాబును విచారించగా, వెంకట్రాదిగూడెం గ్రామానికి చెందిన యలగం నాగేశ్వరరావు పేరు బయటకు వచ్చింది. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని, అతని వద్ద నుంచి 5 నాటు తుపాకులు, ఒక తుపాకీ చెక్క, తుపాకులు తయారు చేసే వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. తుపాకీ పనిచేసే మెకానిజానికి వెల్డింగ్ పనులు చేస్తున్న రాఘవాపురం, కమలాపురం గ్రామానికి చెందిన తోటకూర రామరాజును అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి వెల్డింగ్ మిషన్, నాటు తుపాకీ మెకానిజం భాగాన్ని స్వాధీనం చేసుకున్నారు. తుపాకీ బ్యారల్ గొట్టం తయారు చేస్తున్న ఏలూరు పవర్‌పేట రైల్వేస్టేషన్ రోడ్డు ప్రాంతానికి చెందిన మంతెన వీరభద్రాచారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి తుపాకీ బ్యారల్ తయారీకి వినియోగించే రెండు ఇనుప గొట్టాలను స్వాధీనం చేసుకున్నారు.
స్వాధీనం చేసుకున్న సొత్తు
ఈ కేసులో ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి వారి నుంచి 6 నాటు తుపాకులు, తుపాకీ తయారీ చెక్క, 4 తుపాకీ తూటాలు, తుపాకీ తయారీకి వినియోగించే పేలుడు పదార్థం, తుపాకీ తయారీ పరికరాలు, ఒక తుపాకీ మెకానిజం భాగం, రెండు ఇనుప బ్యారల్ గొట్టాలు, ఒక వెల్డింగ్ మిషన్, ఒక హీరో గ్లామర్ మోటారు సైకిల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును ఛేదించడంలో ప్రతిభ కనబరిచిన చింతలపూడి సీఐ క్రాంతికుమార్, ఎస్సై సతీష్‌కుమార్, కానిస్టేబుళ్లు వినోద్‌కుమార్, హనుమంతరావు, భగవాన్, సత్యనారాయణ, ప్రకాష్, లక్ష్మణరావు, బాబురావు, రమేష్, హోంగార్డు సురేష్‌లను ఏలూరు జిల్లా ఎస్పీ కేపీ శివకిషోర్ ప్రత్యేకంగా అభినందించారు.
హత్యాయత్నాన్ని భగ్నం చేసిన జంగారెడ్డిగూడెం పోలీసులు
ఐదుగురి అరెస్ట్, నాటు తుపాకులు, తయారీ సామగ్రి స్వాధీనం
వివరాలు వెల్లడించిన ఎస్పీ శివకిషోర్


