జయహో జగన్నాథ | - | Sakshi
Sakshi News home page

జయహో జగన్నాథ

Jul 26 2026 2:02 AM | Updated on Jul 26 2026 2:02 AM

జయహో జగన్నాథ వయో పరిమితిని ఎత్తేయాలి అతి వేగమే ప్రమాదాలకు కారణం పారా లీగల్‌ వలంటీర్లగా అవకాశం పెరుగుతున్న గోదావరి వరద

ద్వారకాతిరుమల: జై జగన్నాథ.. జయహో జగన్నాథ అంటూ భక్తుల నామస్మరణలతో జగన్నాథ రథయాత్ర శనివారం సాయంత్రం తిమ్మాపురం గ్రామానికి అట్టహాసంగా సాగింది. శ్రీవారి ఆలయానికి దత్తత దేవాలయమైన లక్ష్మీపురంలోని శ్రీ సంతాన వేణుగోపాల జగన్నాథ, శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో జగన్నాథుని దివ్య రథోత్సవాలు ఈనెల 16 నుంచి వైభవంగా జరుగుతున్నాయి. ఆఖరి రోజు సాయంత్రం ఆలయం వద్ద రథన్ని విశేషంగా అలంకరించారు. అర్చకులు సుభద్ర, బలభద్ర, జగన్నాథుడి దారు విగ్రహాలను ఆలయం నుంచి తీసుకొచ్చి, రథంలో వేంచేపు చేసి, పూజాదికాలను నిర్వహించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, కోలాట నృత్యాల నడుమ జగన్నాథుడి రథం అశేష భక్తజన సందోహం నడుమ లక్ష్మీపురం మీదుగా సమీప గ్రామమైన తిమ్మాపురం తరలివెళ్లింది. ప్రతి ఇంటి ముంగిట భక్తులు జగన్నాథుడిని దర్శించి తరించారు. తిరిగి రధం రాత్రికి ఆలయానికి చేరుకుంది.

నూజివీడు: రాష్ట్రంలోని నాలుగు ట్రిపుల్‌ ఐటీలను నిర్వహిస్తున్న ఆర్‌జీయూకేటీలో ప్రభుత్వం భర్తీ చేస్తున్న అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, లెక్చరర్‌ పోస్టులకు వయో పరిమితి విధించడంపై కాంట్రాక్టు అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, మెంటార్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ట్రిపుల్‌ ఐటీల్లో 104 లెక్చరర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. గరిష్ట వయో పరిమితి ఓసీ అభ్యర్థులకు 44 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు 49 ఏళ్లుగా నిబంధన విధించింది. దీంతో గత 18 ఏళ్లుగా ట్రిపుల్‌ ఐటీలను నమ్ముకుని పనిచేస్తున్న దాదాపు 200 మంది కాంట్రాక్టు మెంటార్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లలో సుమారు 70 మంది రాత పరీక్షకు అనర్హులుగా మారే ప్రమాదం ఏర్పడింది. 2023లో అప్పటి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌లో లెక్చరర్‌ పోస్టులకు ఎలాంటి వయో పరిమితి విధించలేదు. దీనివల్ల ట్రిపుల్‌ ఐటీల ప్రారంభం నుంచి పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం లభించింది. వయో పరిమితి నిబంధనను సడలించి న్యాయం చేయాలని కాంట్రాక్టు అధ్యాపకులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): అతి వేగమే ప్రమాదాలకు కారణమని, ఓపికతో, నేర్పుతో జాగ్రత్తగా వాహనం నడిపితే మీతోపాటు ఎక్కిన ప్రయాణికులను క్షేమంగా గమ్యం చేర్చవచ్చని ఉప రవాణా కమిషనర్‌ షేక్‌ కరీమ్‌ సూచించారు. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఏలూరు డిపో గ్యారేజ్‌లో శనివారం ప్రమాద రహిత వారోత్సవాల కార్యక్రమం ప్రారంభించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న కరీమ్‌ మాట్లాడుతూ వాహనం నడిపేటప్పుడు తొందర పని చేయదని, ఓవర్‌ టేక్‌ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని, వానాకాలంలో వాహనం నడిపేటప్పుడు మరిన్ని జాగ్రత్తలతో వాహనాన్ని నడపాలని సూచించారు. ప్రమాదాలకు గురికాకుండా ఉండాలని, ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ తమ విధులను నిర్వహించాలని సూచించారు. జిల్లా ప్రజా రవాణా అధికారి షేక్‌ షబ్నం మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వారోత్సవాలు జనవరిలో జరుగుతాయని, ఈ సంవత్సరం జూలైలో వారం రోజులు పాటు నిర్వహిస్తున్నారన్నారు. కార్యక్రమంలో డిపో మేనేజర్‌ బి.వాణి, తదితరులు పాల్గొన్నారు.

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఏలూరులో పారా లీగల్‌ వలంటీర్లుగా పని చేసేందుకు ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్‌.శ్రీదేవి శనివారం ప్రకటనలో తెలిపారు. సమాజ సేవ మీద ఆసక్తి ఉండి స్వచ్ఛందంగా కక్షిదారులకు, న్యాయ సేవాధికార సంస్థ కోసం పనిచేసేందుకు ముందుకు రావాలని కోరారు. కనీసం పదో తరగతి అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామన్నారు. ఆగస్టు 5 లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

పోలవరం రూరల్‌: గోదావరి వరద మళ్ళీ పెరుగుతోంది. నదిలోకి చేరే శబరి నీటితో పాటు ఎగువ ప్రాంతాల నుంచి నదిలోకి భారీగా నీరు చేరడంతో వరద ప్రవాహం పెరిగింది. పోలవరం ప్రాజెక్టు స్పిల్‌ వే వద్ద 28 మీటర్లకు నీటిమట్టం చేరుకుంది. స్పిల్‌వే నుంచి 51,000 క్యూసెక్కుల వరద నీరు దిగువకు చేరుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement