రెచ్చిపోతున్న మట్టి మాఫియా | - | Sakshi
Sakshi News home page

రెచ్చిపోతున్న మట్టి మాఫియా

Jul 24 2026 1:03 AM | Updated on Jul 24 2026 1:03 AM

రెచ్చిపోతున్న మట్టి మాఫియా

మట్టి మాఫియాపై చర్య తీసుకోవాలి

కామవరపుకోట: మండలంలో మట్టి మాఫియా యథేచ్ఛగా రెచ్చిపోతోంది. స్థానిక ప్రభుత్వ స్థలాలు, చెరువులు, కుంటలను లక్ష్యంగా చేసుకుని జేసీబీలతో తోడేస్తూ, టిప్పర్లు, ట్రాక్టర్లలో మట్టిని తరలిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి, ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా తవ్వకాలు జరుపుతున్నారు. ఆ మట్టిని ప్రైవేట్‌ నిర్మాణాలకు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులకు, ఇటుక బట్టీలకు అమ్ముకుంటూ అక్రమార్కులు లక్షల రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారు. గత కొంతకాలంగా రాత్రి, పగలు తేడా లేకుండా ఈ అక్రమ తవ్వకాలు సాగుతున్నాయి. స్థానిక అధికార పార్టీ నాయకుల అండదండలతో, నకిలీ అనుమతులు చూపిస్తూ అవసరానికి మించి మట్టిని తోడేస్తున్నారు. ఇతర ప్రాంతాలకు సైతం తరలిస్తూ అక్రమార్కులు విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు.

జనావాసాల మధ్య అతివేగం.. ప్రశ్నిస్తే బెదిరింపులు!

జనావాసాల మధ్య నుంచి టిప్పర్లు, ట్రాక్టర్లు అతివేగంగా రాకపోకలు సాగిస్తుండటంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని స్థానికులు భయాందోళన చెందుతున్నారు. అక్రమ రవాణాను స్థానికులు ఎవరైనా ప్రశ్నిస్తే బెదిరింపులకు దిగుతున్నారు. ఇటీవల తడికలపూడిలో జరుగుతున్న మట్టి తవ్వకాలపై ఓ విలేకరి వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసినందుకు, అతనిని కూడా బెదిరించి హెచ్చరించినట్లు సమాచారం.

పర్యావరణానికి తీవ్ర ముప్పు!

ఈ మట్టి మాఫియా వల్ల ఒకవైపు ప్రభుత్వ ఆదాయానికి గండి పడటంతో పాటు, మరోవైపు గుట్టలు, కొండలను ఇష్టానుసారంగా తవ్వేయడం వల్ల పర్యావరణ సమతుల్యత తీవ్రంగా దెబ్బతింటోందని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెరువులు, కుంటల్లో పరిమితికి మించి మట్టి తీయడం వల్ల నీరు నిల్వ ఉండే సామర్థ్యం తగ్గిపోతోందని, భూగర్భ జలాలు ఇంకిపోయి బోర్లు ఎండిపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. మైనింగ్‌, రెవెన్యూ, పోలీస్‌ శాఖల అధికారులు అప్పుడప్పుడు తనిఖీలు చేస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో కఠిన చర్యలు లేకపోవడంతో ఈ ప్రాంతం మాఫియాకు అడ్డాగా మారుతోందని స్థానికులు మండిపడుతున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి, మట్టి అక్రమ రవాణాపై పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయాలని, అక్రమార్కులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని ప్రజాసంఘాలు, స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు.

ప్రభుత్వ భూములు, చెరువులే లక్ష్యం

రాత్రింబవళ్లూ అక్రమ రవాణా

ప్రభుత్వ ఆదాయానికి గండి

పర్యావరణానికి ముప్పు వాటిల్లుతోందని పర్యావరణవేత్తల ఆందోళన

గత కొంత కాలంగా అక్రమార్కులు టీడీపీ అండదండలతో చెరువులు, ప్రభుత్వ భూములు, గుట్టలను ఇష్టానుసారం తవ్వి మట్టిని అక్రమంగా తరలిస్తూ లక్షలాది రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారు. దీనివలన ప్రభుత్వ ఆదాయానికి గండిపడటంతో పాటు భూగర్భజలాలు ఇంకిపోయి బోర్లలోని నీరు ఎండిపోయి రైతులకు తీవ్ర నష్టం జరిగే ప్రమాదం ఉంది. అధికారులు వెంటనే స్పందించి మట్టి మాఫియాపై చర్యలు తీసుకోవాలి.

– కంభం విజయరాజు, వైఎస్సార్‌ సీపీ చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement