పాలకోడేరు: తనపై, తన కుమారుడు పాలా రాధాకృష్ణపై ఈ నెల 6వ తేదీన జరిగిన దాడి కేసులో పోలీసులు బలహీనమైన సెక్షన్లు నమోదు చేశారని వేండ్ర గ్రామానికి చెందిన బాధితురాలు పాలా గోగులమ్మ ఆరోపించారు. పొలం సరిహద్దు వివాదాన్ని పురస్కరించుకుని అదే గ్రామానికి చెందిన కవురు గంగాధరరావు, ఆయన భార్య, కొడుకు కలిసి తమపై కత్తులతో దాడి చేశారని ఆమె తెలిపారు. ఈ ఘటనలో గోగులమ్మ తలకు తీవ్ర గాయమై 18 కుట్లు పడ్డాయని, రాధాకృష్ణకు కూడా తీవ్ర గాయాలు కావడంతో నేటికీ ప్రైవేట్ ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారని వాపోయారు. ఈ ఘటనపై పాలకొడేరు పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నెం. 96/2026 కింద కేసు నమోదైంది. ఎఫ్‌ఐఆర్‌లో బీఎన్‌ఎస్ 329(3), 118(1), 351(2), 3(5) సెక్షన్లు నమోదు చేసినప్పటికీ.. దాడి తీవ్రతను, ప్రాణహాని తలపెట్టాలనే ఉద్దేశాన్ని పరిగణనలోకి తీసుకుని హత్యాయత్నం వంటి బలమైన సెక్షన్లు జోడించాలని గోగులమ్మ డిమాండ్ చేశారు. ‘మమ్మల్ని చంపాలనే ఉద్దేశంతోనే కత్తులతో తలపై కొట్టారు. నా కొడుకు ఇంకా ఆస్పత్రిలోనే ఉన్నాడు. ఇంత జరిగినా పోలీసులు సరైన సెక్షన్లు పెట్టకుండా నిందితులకు కొమ్ము కాస్తున్నారా?’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి దాడికి ప్రతిదాడి జరిగినట్లుగా క్రైమ్ నెం. 97/2026 కింద ఎదురు కేసు కూడా నమోదైనట్లు ఎఫ్‌ఐఆర్ ద్వారా తెలుస్తోంది. న్యాయం జరిగే వరకు పోరాడతామని, అవసరమైతే ఉన్నతాధికారులను కలుస్తామని బాధితుల కుటుంబం స్పష్టం చేసింది. కేసులో కఠినమైన సెక్షన్లు జోడించి నిందితులను శిక్షించాలని వేండ్ర అగ్రహారం మాజీ సర్పంచ్ ముత్యాలరావుతో పాటు గ్రామస్తులు కోరుతున్నారు. మరొకవైపు, మెడికల్ రిపోర్ట్ ఆధారంగానే కేసు నమోదు చేశామని, ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు.
తణుకు అర్బన్: తణుకు మండలం కొమరవరం గ్రామ శివారులోని కొండాలమ్మ గుడిలో చోరీకి ప్రయత్నించిన దొంగను స్థానికులు పట్టుకున్నారు. గురువారం గుర్తుతెలియని వ్యక్తి ఆలయంలోకి ప్రవేశించి చోరీకి ప్రయత్నించగా పట్టుకున్న గ్రామస్తులు స్తంభానికి కట్టి దేహశుద్ధి చేశారు. అనంతరం తణుకు రూరల్ పోలీసులకు సమాచారం అందజేశారు. ఈ ఘటనపై గ్రామస్తులు ఇచ్చే ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయనున్నట్లు ఎస్సై నాళం శ్రీనివాసరావు తెలిపారు.
వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ బాధితుల ఆవేదన
ఏలూరు టౌన్ : ఏలూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (జీజీహెచ్)లో ప్రజలకు మెరుగైన వైద్యం అందే పరిస్థితి కనిపించడం లేదు. వైద్యులు, సిబ్బంది తీవ్ర నిర్లక్ష్య వైఖరి వల్ల కళ్లు తెరవకముందే పురిటిలోనే పసిబిడ్డల ప్రాణాలు గాల్లో కలసిపోతున్నాయి. లింగపాలెం మండలం అయ్యపరాజుగూడెంకు చెందిన సిలారపు స్వీటీ అనే మహిళ తన మొదటి కాన్పు కోసం మూడు రోజుల క్రితం (మంగళవారం) జీజీహెచ్‌లో చేరింది. మొదటి సంతానం కావడంతో స్వీటీ, ఆమె భర్త మహేష్ తమ బిడ్డ కోసం ఎంతో ఆశగా ఎదురుచూశారు. తీరా గురువారం ప్రసవం పూర్తయ్యాక చూస్తే... నవజాత శిశువు తలకు గాయాలు ఉండటంతో పాటు బిడ్డ మృతి చెంది ఉండటంతో కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యమే తమ బిడ్డను దక్కకుండా చేసిందంటూ హాస్పిటల్ వద్ద ఆందోళనకు దిగారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు తక్షణమే సమగ్ర విచారణ జరిపి, బాధ్యులైన వైద్యులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.


