ద్వారకాతిరుమల: శ్రీవారి దేవస్థానం ధర్మకర్తల మండలి సమావేశంలో భక్తుల సౌకర్యాలు, ఆలయ అభివృద్ధి, సేవల విస్తరణ, ఆదాయ వృద్ధి, విద్యా సంస్థల అభివృద్ధికి సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దేవస్థానం చైర్మన్ ఎస్‌వీ సుధాకర్‌రావు అధ్యక్షతన గురువారం జరిగిన సమావేశంలో ఆలయ ఈఓ వేండ్ర త్రినాథరావు, ఆలయ ప్రధానార్చకులు పీవీఎస్‌ఎస్‌ఆర్ జగన్నాధాచార్యులు (ఎక్స్‌అఫిషియో మెంబర్), బోర్డు సభ్యులు పాల్గొన్నారు.
ట్రస్ట్‌బోర్డు కీలక నిర్ణయాలు ఇవీ..
● ద్వారకాతిరుమల గ్రామస్తులకు ప్రస్తుతం అమలులో ఉన్న శీఘ్ర దర్శనాన్ని ఉత్తర ద్వారం ద్వారా కొనసాగించేందుకు బోర్డు ఆమోదం తెలిపింది.
● అంతరాలయంలో శ్రీవారి మూలమూర్తులకు అష్టోత్తర శతనామార్చన సేవను ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. ఈ సేవలో పాల్గొనే దంపతులకు రూ.3,116 రుసుం నిర్ణయించారు. అలాగే గతంలో నిర్వహించిన కోటి తులసీ పూజను తిరిగి ప్రారంభించే అంశంపై సమీక్షించారు.
● దేవస్థానం సంస్కృతోన్నత పాఠశాల వెలుపల ఉన్న వినాయకుని మందిరాన్ని పాఠశాల గ్రౌండ్‌లోని ఖాళీ స్థలంలోకి మార్పు చేసి, నూతన ఆలయాన్ని నిర్మించేందుకు అంచనాలను ఆమోదించారు.
● భక్తులకు నాణ్యమైన పాల ఉత్పత్తులను అందుబాటులో ఉంచే లక్ష్యంతో విజయ డెయిరీ (కృష్ణ జిల్లా మిల్క్ ప్రొడ్యూసర్ కం లిమిటెడ్) పాల ఉత్పత్తుల విక్రయ కేంద్రం ఏర్పాటుకు షాపు కేటాయింపునకు ఆమోదం తెలిపింది.
● శ్రీవారి ఆగమ పాఠశాలలో ఆగమ విద్య పూర్తి చేసిన విద్యార్థులు తప్పనిసరిగా 3 నెలల పాటు దేవస్థానానికి చెందిన ఆలయాల్లో అప్రెంటిస్ చేయాలని నిర్ణయించారు.
● వాహనాల టోల్ రుసుంను వసూలు చేసుకునే లైసెన్స్ హక్కునకు రెండేళ్ల కాలపరిమితికి నిర్వహించిన బహిరంగ వేలం, సీల్డ్ టెండర్ ద్వారా వచ్చిన అత్యధిక బిడ్‌ను ఆమోదించారు.
● శ్రీవారి క్షేత్ర దత్తత దేవాలయాలైన మైలవరంలోని శ్రీ వేంకటేశ్వరస్వామి, శ్రీ భ్రమరాంబ మల్లేశ్వరస్వామి ఆలయాల్లో కొబ్బరి చెక్కల సేకరణ లైసెన్స్ హక్కునకు జరిగిన బహిరంగ వేలం ద్వారా వచ్చిన హెచ్చు పాటలను ఆమోదించారు.
● శ్రీవారి ప్రసాదాల తయారీ, పడితరం, అన్నప్రసాదం తయారీకి అవసరమైన 21 రకాల రసవర్గాల సరఫరా కోసం నిర్వహించిన ఈ–ప్రొక్యూర్మెంట్ టెండర్ల ద్వారా వచ్చిన తక్కువ ధరలను ఆమోదించారు.
● రాబోయే ఆశ్వయుజ మాస తిరుకల్యాణ మహోత్సవాలను దృష్టిలో ఉంచుకొని తాత్కాలిక గోల్డ్ కలర్ ఫైబర్ మండపం, పందిళ్లు, రంగులకు అవసరమైన అంచనాలను ఆమోదించారు.
● క్షేత్రంలోని హైస్కూల్ గ్రౌండ్‌లో ఉన్న గరుడాళ్వార్, ఆళ్వార్ సదనం ఎదురుగా ఉన్న శ్రీ ఆంజనేయస్వామి భారీ విగ్రహాలకు రంగులు వేయడానికి అవసరమైన అంచనాలను ఆమోదించారు.
● శ్రీ భ్రమరాంబ మల్లేశ్వరస్వామి దేవాలయం వద్ద, వకుళమాత అన్నప్రసాద భవనం సమీపంలో పీపీజీఐ బస్సు షెల్టర్ల నిర్మాణానికి అంచనాలు ఆమోదించారు.
● ప్రధాన ఆలయం, దత్తత దేవాలయాలు, వివిధ ట్రస్టుల జూన్–2026 నెల ఆదాయ, వ్యయాలను పరిశీలించి ఆమోదించారు.


