చింతలపూడి (జంగారెడ్డిగూడెం): స్థానిక పద్మ థియేటర్ ఎదురుగా ఉన్న శ్రీ వారాహి అమ్మవారి ఆలయంలో జరుగుతున్న ఆషాఢ మాసోత్సవాల్లో ప్రముఖ సహస్రావధాని, పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ గరికపాటి నరసింహారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని, వారాహి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన ఆయనకు ఆలయ కమిటీ, వేద పండితులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు కురెళ్ళ రాంబాబు శర్మ ఆధ్వర్యంలో వేద పండితులు ఆయనకు వేదాశీర్వచనం అందజేసి, తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం నిర్వహించిన ఆధ్యాత్మిక సభలో గరికపాటి ప్రసంగిస్తూ... మానవ జీవితంలో వారాహి దేవి ఉపాసన, బ్రహ్మచర్యం, దైవీ గుణాల ప్రాధాన్యతను వివరించారు. దైవభక్తితో పాటు ప్రతి ఒక్కరిలో కరుణ, దయ, సద్గుణాలు ఉండాలని... తోటివారికి సహాయపడే మనస్తత్వమే నిజమైన భక్తికి నిదర్శనమని పేర్కొన్నారు. దేవసేన అంటే కేవలం సైన్యం మాత్రమే కాదని, మనిషిలో ఉండాల్సిన దైవీ గుణాలకు ప్రతీక అని వ్యాఖ్యానించారు. సమాజంలో అసూయ, గర్వం వీడి అంతా ఐక్యతతో మెలిగినప్పుడే ఆత్మజ్ఞానం, సుఖశాంతులు కలుగుతాయని ఉద్బోధించారు. ఆధ్యాత్మిక చింతనతో పాటు ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని గడపాలని భక్తులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు, వేద పండితులు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.


