వసూల్‌ రాజా ! | - | Sakshi
Sakshi News home page

వసూల్‌ రాజా !

Jul 23 2026 1:12 AM | Updated on Jul 23 2026 1:12 AM

షరా‘మామూలే’

షరా‘మామూలే’

సాక్షి, భీమవరం: పైవాళ్లకు పంపాలంటూ అసోసియేషన్‌ నేత అదనపు వసూళ్లు పశ్చిమ రైస్‌ మిల్లింగ్‌ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారాయి. ఏసీకే ఫార్మాలిటీస్‌ అన్నీ ఇచ్చేశాక రాష్ట్రంలో ఏ జిల్లాలోను లేని విధంగా పశ్చిమగోదావరి జిల్లాలో ఇప్పుడు మళ్లీ ప్రత్యేక వసూళ్లు ఎవరి జేబులోకని చర్చించుకుంటున్నారు. ఎందుకొచ్చిన గొడవని ఎవరికి వారు గుట్టుచప్పుడు కాకుండా ముట్టచెబుతున్నారు. రూ.12 కోట్లు టార్గెట్‌కు రెండు రోజుల్లో రూ.10 కోట్లకు పైగానే కలెక్షన్‌ వసూలు చేసినట్టు విశ్వసనీయవర్గాల సమాచారం.

రైతుల నుంచి సివిల్‌ సప్లయిస్‌ శాఖ సేకరించిన ధాన్యాన్ని కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ (సీఎంఆర్‌) కోసం మిల్లులకు అప్పగిస్తుంది. మిల్లింగ్‌ చేసి 67 శాతం బియ్యాన్ని మిల్లర్లు సివిల్‌ సప్లయిస్‌కు అప్పగించాలి. గత ఖరీఫ్‌లో జిల్లాలోని రైతుల నుంచి దాదాపు 4.45 లక్షల మెట్రిక్‌ టన్నులు, రబీలో 7.82 లక్షలు మెట్రిక్‌ టన్నులు కలిపి 12.27 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించారు. 29 టన్నుల బియ్యాన్ని ఒక ఏసీకే (ఎక్‌నాలెడ్జ్‌మెంట్‌)గా పరిగణిస్తారు. ఈ మేరకు 28,116 ఏసీకేల బియ్యాన్ని సివిల్‌ సప్లయిస్‌కు అప్పగించాలి. దీనిలో కొంత మొత్తం ఎఫ్‌సీఐకు, మిగిలిన బియ్యాన్ని పబ్లిక్‌ డిస్ట్రిబ్యూషనన్‌ సిస్టమ్‌ (పీడీఎస్‌)కు సివిల్‌ సప్లయిస్‌ కేటాయింపులు చేస్తుంది.

ప్రత్యేక కలెక్షన్‌

ఖరీఫ్‌, రబీ సీఎంఆర్‌ మేరకు ఇప్పటికే ఫార్మాలటీస్‌ పూర్తిచేసినట్టు సమాచారం. కాగా అసోసియేషన్‌లోని కీలక నేత తాజాగా బ్రోకెన్‌ పర్సంటేజీని మేనేజ్‌ చేసే నిమిత్తం ప్రభుత్వంలోని పైవాళ్లకు ఇవ్వాలంటూ ఏసీకేకు రూ.4,500 చొప్పున ఇవ్వాలని మిల్లర్లకు హుకుం చేసినట్లు తెలుస్తోంది. జిల్లాలో 207 మిల్లులకు గాను సీఎంఆర్‌ కేటాయింపుల మేరకు దాదాపు రూ.12 కోట్లు కలెక్షన్‌ చేయాలని టార్గెట్‌ పెట్టుకున్నారట. కూటమి పక్షాలకు చెందిన నేతల అండదండలు పుష్కలంగా ఉన్న సదరు నేతతో ఎందుకొచ్చిన గొడవని మిల్లర్లు చెప్పిన మొత్తం చెల్లిస్తున్నారు. రెండు రోజుల్లో పలు మిల్లుల నుంచి రెండు రోజుల్లో రూ.10 కోట్ల వరకు కలెక్షన్‌ చేసినట్టు రైస్‌మిల్లింగ్‌ వర్గాల్లో టాక్‌ నడుస్తోంది. ఇరుగుపొరుగు జిల్లాల్లో ఎక్కడా లేని విధంగా కేవలం పశ్చిమగోదావరి జిల్లాలోనే ఈ స్పెషల్‌ కలెక్షన్‌ జరుగుతోందని, ఈ మొత్తం ఎవరి జేబుల్లోకి వెళుతుందని మిల్లర్లు చర్చించుకుంటున్నారు. మరోపక్క సీఎంఆర్‌ కేటాయింపుల్లోను సదరు నేత ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారన్న టాక్‌ ఉంది. మిల్లింగ్‌ కెపాసిటీ మేరకు సీఎంఆర్‌ కేటాయింపులు చేయాలి. ప్రైవేట్‌ ట్రేడింగ్‌ చేసే మిల్లులకు సీఎంఆర్‌ ఇవ్వకూడదు. కాగా కూటమికి చెందిన కొంతమంది ఎమ్మెల్యేలను అడ్డంపెట్టుకుని ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారన్న పేరుంది. తనకు కావాల్సిన వారికి ఎక్కువగాను, లేనివారికి తక్కువగాను కేటాయింపులు చేస్తున్నారనుకుంటున్నారు. అధికారులు ఆయన చెప్పిన విధంగానే నడుచుకుంటున్నారన్న విమర్శలున్నాయి.

పైవాళ్ల పేరిట పశ్చిమలో ప్రత్యేక దందా

రైస్‌ మిల్లర్ల నుంచి ఏసీకేకు రూ.4,500 అదనపు వసూలు

ఖరీప్‌, రబీలో సీఎంఆర్‌ ద్వారా 28,347 ఏసీకేల బియ్యం ఉత్పత్తి

రైస్‌ మిల్లుల నుంచి రూ.12 కోట్ల మేర కలెక్షన్‌ టార్గెట్‌

రెండు రోజుల్లో రూ.10 కోట్లకు పైగానే వసూలు

(ఏఐ సృష్టించిన చిత్రం)

మిల్లర్లు ఇచ్చే బియ్యంలో నూకలు (బ్రోకెన్‌) పర్సంటేజీ గతంలో 25 శాతం వరకు ఎఫ్‌సీఐ అనుమతి ఇచ్చేది. గత సీజన్‌ నుంచి బ్రోకెన్‌ను 10 శాతానికి పరిమితం చేసింది. ఎఫ్‌సీఐ ప్రమాణాలకు లోబడి బియ్యం నాణ్యత ఉండాలి. సీఎంఆర్‌ బియ్యం తీసుకునే సమయంలో నిబంధనల పేరిట సంబంధిత అధికారులు ఇబ్బందులు పెట్టకుండా కింది స్థాయి నుంచి ఉన్నతస్థాయి వరకు మిల్లర్లు మామూళ్లు ముట్టజెబుతుంటారు. ఒక ఏసీకేకు సుమారు రూ. 2,500 చొప్పున కేటాయింపుల మేరకు ఈ ముడుపులు ఉంటాయి. రీసైకిల్‌ చేసిన పీడీఎస్‌ బియ్యానికి రూ.10 వేల వరకు ఉంటుంది. రాజకీయ నేతలకు ఇచ్చే మామూళ్లు సెపరేటుగా ఉంటాయి. మిల్లర్ల నుంచి సేకరించి పైస్థాయికి చేరేవేసే బాధ్యతను అసోసియేషన్‌ చూసుకుంటుంది. ఈ వ్యవహారమంతా తెరవెనుక గట్టుచప్పుడు కాకుండా సాగిపోతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement