ద్వారకాతిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల చిన్నవెంకన్న ఆలయాన్ని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టీస్ వి.గోపాలకృష్ణారావు బుధవారం సతీసమేతంగా సందర్శించారు. ముందుగా ఆలయానికి విచ్చేసిన ఆయనకు దేవస్థానం అధికారులు, అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ప్రదక్షిణలు నిర్వహించిన అనంతరం న్యాయమూర్తి స్వామి, అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తరువాత ఆలయ ముఖ మండపంలో అర్చకులు, పండితులు ఆయనకు శ్రీవారి శేష వస్త్రాన్ని కప్పి వేద ఆశీర్వచనాన్ని పలుకగా, దేవస్థానం ఏఈఓ మెట్టపల్లి దుర్గారావు స్వామి వారి చిత్రపటాన్ని, ప్రసాదాలను అందజేశారు. న్యాయమూర్తి వెంట భీమడోలు కోర్టు జడ్జి ఎస్. ప్రియదర్శిని నూతక్కి, ఆలయ సూపరింటెండెంట్ ఐవీ రామారావు తదితరులున్నారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): యోగాసన క్రీడల ప్రోత్సాహం, ఆరోగ్యంపై చైతన్యం, క్రీడా స్ఫూర్తి పెంపొందించడమే లక్ష్యంగా యోగాసన భారత్ ఏలూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 26వ తేదీన జిల్లా స్థాయి యోగాసన పోటీలు నిర్వహించనున్నట్టు ఆ సంస్థ ప్రధాన కార్యదర్శి మోటమర్రి మల్లిఖార్జునరావు ఒక ప్రకటనలో తెలిపారు. రతుంగ గేమ్స్ పేరిట నిర్వహిస్తున్న ఈ పోటీలు స్థానిక వన్‌టౌన్‌లోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి సత్రంలో ఉదయం 8 గంటలకు ప్రారంభమౌతాయన్నారు. ఆర్టిస్టిక్ సింగల్, ఆర్టిస్టిక్ పెయిర్, రిథమిక్ పెయిర్, ఆర్టిస్టిక్ గ్రూప్, ట్రెడిషనల్ గ్రూప్ అంశాల్లో పోటీలు నిర్వహిస్తామన్నారు. ఈ పోటీలు సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ల విభాగాల్లో జరుగుతాయని, జిల్లాలోని అన్ని పాఠశాలల, కళాశాలల విద్యార్థులతో పాటు యోగాసన కేంద్రాల విద్యార్థులు, ప్రజలు పాల్గొనవచ్చన్నారు. వివరాలకు 98486 11744, 83094 15417, 94907 34033 నంబర్లలో సంప్రదించవచ్చన్నారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): నీట్ పరీక్షా పత్రాల లీకేజీపై ఢిల్లీలో ఆందోళన చేస్తున్న విద్యార్థి, యువజనులపై ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ ప్రభుత్వాలు సాగించిన పాశవిక లాఠీచార్జీని ఖండిస్తూ ఐఎఫ్‌టీయూ, పీవైఎల్, ఏఐకేఎంఎస్ సంఘాల ఆధ్వర్యంలో ఏలూరు పాత బస్టాండ్ సెంటర్లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇఫ్టూ రాష్ట్ర సహాయ కార్యదర్శి యూవీ మాట్లాడుతూ... లక్షలాది మంది విద్యార్థులు, యువజనుల భవిష్యత్తును నాశనం చేసేలా నీట్ పరీక్షా పత్రాల లీకేజీకి కారణమైన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాజీనామా కోరుతూ విద్యార్థి, యువజనులు చేపట్టిన ఉద్యమంపై మోదీ, అమిత్ షాల ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా దమనకాండను ప్రయోగించడాన్ని తీవ్రంగా విమర్శించారు. అంతేకాకుండా, పోలీసుల ముసుగులో ఆర్‌ఎస్‌ఎస్ గూండాలు కూడా దాడికి దిగారని ఆరోపించారు. ప్రగతిశీల యువజన సంఘం జిల్లా నాయకుడు టి. బాబురావు మాట్లాడుతూ విద్యార్థి, యువజనులపై దారుణంగా లాఠీచార్జ్ చేసి తీవ్ర హింసకు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. నిరసన కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షుడు పోరండ్ల శ్రీనివాస్, ఇఫ్టూ జిల్లా ప్రధాన కార్యదర్శి బద్దా వెంకట్రావు, నగర అధ్యక్షుడు బి.సోమయ్య, నగర ప్రధాన కార్యదర్శి ఎర్రా శ్రీనివాసరావు, నాయకులు డి.వీరినాయుడు, మంగం అప్పారావు పాల్గొన్నారు.
పోలవరం రూరల్: ఎగువ ప్రాంతాల నుంచి నదిలోకి నీరు భారీగా చేరడంతో వరద ప్రవాహం క్రమేణా పెరుగుతోంది. పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే వద్ద నీటిమట్టం 26 మీటర్లకు చేరుకుంది. ప్రస్తుతం స్పిల్‌వే నుంచి 32 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో దిగువ ప్రాంతాల్లో కూడా వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది.


