లింగపాలెం: ఎల్‌నినో ప్రభావంతో సాగునీటి కొరత ఏర్పడే అవకాశం ఉన్నందున రైతులు ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యమివ్వాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి సూచించారు. బుధవారం ధర్మాజీగూడెంలో పర్యటించిన ఆమె, పంట పొలాలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. సాగునీటి లభ్యత తక్కువగా ఉన్నందున ఆరుతడి పంటల వైపు రైతులు మొగ్గు చూపాలని, ఆ దిశగా రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయాధికారులను ఆదేశించారు. అనంతరం స్థానిక రామకృష్ణ మేన్యూర్ డిపోను తనిఖీ చేసి, నిల్వల పట్టికను బోర్డుపై ఉంచాలని, యాప్ ద్వారానే ఎరువుల విక్రయాలు జరపాలని ఆదేశించారు. నూజివీడు సబ్ కలెక్టర్ బి.వినూత్న, జిల్లా వ్యవసాయాధికారి హబీబ్ బాషా, తహసీల్దార్ నజీముల్లాషా పాల్గొన్నారు.
పాఠశాల ఆకస్మిక తనిఖీ
ధర్మాజీగూడెం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు పాఠాలు బోధించి, వారి సమాధానాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. మధ్యాహ్న భోజన నాణ్యత, మౌలిక వసతులను పరిశీలించి, పాఠశాలల్లో ఉత్తీర్ణత శాతం పెంచేలా కృషి చేయాలని ఉపాధ్యాయులకు స్పష్టం చేశారు. అనంతరం గ్రామంలోని ‘భవిత’ దివ్యాంగుల పాఠశాలను సందర్శించి విద్యార్థులకు అందుతున్న వసతులు, వైద్య సేవలను పరిశీలించారు.


