కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): కూటమి పాలనలో రాష్ట్రం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని, పేదలు, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు చింతా మోహన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఉదయం స్థానికంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... రాష్ట్రంలో నిరుద్యోగులు తీవ్ర నిరాశ, నిస్పృహల్లో ఉన్నారని, డిగ్రీలు, ఇంజనీరింగ్ చదివిన యువత కేవలం రూ.5 వేలు, రూ.10 వేల జీతాలకే పనిచేస్తూ దుర్భర జీవితం గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు 19 ఏళ్ల పాలనలో అభివృద్ధి శూన్యమని విమర్శించారు. రాష్ట్రంలో కాపులు 20 శాతం మంది ఉన్నప్పటికీ, ఇప్పటివరకూ ఏ కాపు నాయకుడూ ఎందుకు ముఖ్యమంత్రి కాలేకపోయారో ఆ సామాజికవర్గ ప్రజలు ఆలోచించుకోవాలన్నారు. కాపులు ముఖ్యమంత్రి కావాలంటే కాంగ్రెస్ పార్టీలోకి రావాలని పిలుపునిచ్చారు. దేశంలో నీట్ అక్రమాలపై న్యాయం కోరుతున్న విద్యార్థులపై ఢిల్లీ పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేసి, బూటు కాళ్లతో గొంతులపై తొక్కడం అత్యంత దారుణమన్నారు. పరీక్షలు న్యాయంగా నిర్వహించాలని అడిగినందుకు విద్యార్థులను జైళ్లలో పెట్టడం దేశ చరిత్రలోనే ఎన్నడూ జరగలేదని దుయ్యబట్టారు. విద్యార్థులకు మద్దతుగా నిలిచిన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు.


