ఉత్పత్తి లక్ష్యాన్ని తగ్గించడం దారుణం
● వచ్చే సీజన్‌లో వర్జీనియా ఉత్పత్తి లక్ష్యం భారీగా కోత
● 2026–27 సీజన్‌కు 81.02 మిలియన్ కిలోలకే పరిమితం
బుట్టాయగూడెం : రానున్న 2026–27 సీజన్‌లో వర్జీనియా పొగాకు ఉత్పత్తి లక్ష్యాన్ని భారీగా తగ్గిస్తూ భారత పొగాకు బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బోర్డు అధికారులు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో 2024–25 సీజన్‌కు 170 మిలియన్ కిలోలు, 2025–26 సీజన్‌కు 143 మిలియన్ కిలోల ఉత్పత్తికి అనుమతి ఇచ్చిన బోర్డు, రాబోయే 2026–27 సీజన్‌కు వచ్చేసరికి ఉత్పత్తిని ఏకంగా 81.02 మిలియన్ కిలోలకు కుదించింది. ఇందులో భాగంగా ఉత్తర తేలిక నేలలున్న రాజమహేంద్రవరం రీజియన్ పరిధిలోని జంగారెడ్డిగూడెం–1, 2, దేవరపల్లి, గోపాలపురం, కొయ్యలగూడెం వేలం కేంద్రాల పరిధిలో కేవలం 28.02 మిలియన్ కిలోల ఉత్పత్తికి మాత్రమే ఆమోదం తెలిపింది.
తగ్గింపునకు ప్రధాన కారణాలివే
ప్రస్తుత సీజన్ పొగాకు మార్కెట్‌లో తీవ్ర ఒడిదుడుకులు వ్యక్తమవుతున్నాయి. వేలంలో రోజూ సగానికి పైగా బిల్లులు తిరస్కరణకు గురికావడం, ధరలు ఘోరంగా పడిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ పరిస్థితులకు ప్రధానంగా మూడు అంశాలు కారణమని వ్యాపారులు బోర్డు దృష్టికి తీసుకెళ్లారు. అలాగే సిగరెట్ ఉత్పత్తులపై జీఎస్టీ పెంపుతో పాటు పశ్చిమ ఆసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం, అవసరానికి మించి స్థానికంగా, ఇతర దేశాల్లో పొగాకు దిగుబడి పెరగడం ప్రధాన కారణంగా నిలుస్తున్నాయి. విదేశీ వ్యాపారుల నుంచి ఆశించిన స్థాయిలో ఆర్డర్లు రాకపోవడంతోనే ఈ సంక్షోభం నెలకొందని అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే రాబోయే సీజన్ ఉత్పత్తిని తగ్గించి, ప్రస్తుత సీజన్‌లో మిగిలిపోయిన నిల్వలను కొనుగోలు చేసేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.
అయోమయంలో సాగుదారులు
ఉత్పత్తి లక్ష్యాన్ని సగానికి పైగా కోతేయడంతో రాజమహేంద్రవరం రీజియన్ పొగాకు రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. బోర్డు నూతన నిబంధనల ప్రకారం ప్రతి బేరన్‌కు కేవలం 20 క్వింటాళ్ల ఉత్పత్తికి మాత్రమే అనుమతి ఉంటుంది. దీనివల్ల బేరన్‌కు కేవలం 2 ఎకరాల్లో మాత్రమే సాగు చేయాల్సి వస్తుంది.ఒక్కో రైతుకు గరిష్టంగా 4 బేరన్లకే పరిమితి విధించారు. 2025–26 సీజన్‌లో బేరన్‌కు 41 క్వింటాళ్ల వరకు అనుమతి ఉండేది. ఈ తగ్గింపు వల్ల కనీస పెట్టుబడులు రావని రైతులు వాపోతున్నారు. అనధికార సాగుపై బోర్డు స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు. ఈ పరిస్థితుల్లో పొగాకుకు బదులు ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లడమే మేలని పలువురు భావిస్తున్నారు.
ఏఐ సృష్టించిన చిత్రం
గత నాలుగేళ్లుగా పొగాకు ఉత్పత్తి లక్ష్యాన్ని తగ్గిస్తూనే వస్తున్నారు. రాబోయే సీజన్‌లో మరింత కోత విధించడం వల్ల రైతులు తీవ్రంగా దెబ్బతింటారు. ప్రభుత్వం, పొగాకు బోర్డు ఈ నిర్ణయంపై వెంటనే పునరాలోచన చేసి, ఉత్పత్తి లక్ష్యాన్ని పెంచాలి.
– సయ్యద్ బాజీ, పొగాకు రైతు, అచ్చెయ్యపాలెం


