తాడేపల్లిగూడెం : అసిస్టెంటు ప్రొఫెసర్లుగా దీర్ఘకాలంగా నన్నయ్య విశ్వవిద్యాలయంలో పని చేస్తున్న తమను పర్మినెంటును చేయాలని కోరుతూ స్ధానిక నన్నయ్య ప్రాంగణం వద్ద కాంట్రాక్టు ఉద్యోగులు చేపట్టిన నిరసన బుధవారం మూడో రోజుకు చేరుకుంది.తక్షణమే ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్న కాంట్రాక్టు అసిస్టెంటు ప్రొఫెసర్లను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరుతూ నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకొని నిరసన తెలిపారు.
పాలకొల్లు సెంట్రల్: రాష్ట్రంలో ఫీడ్ ధరలు పెరిగిపోవడం, ప్రాసెసింగ్ ధరలు తగ్గిపోవడంతో ఆక్వా రైతులు తీవ్ర నష్టాల్లో కూరుకుపోయారని రాష్ట్ర ఆక్వా రైతు సంఘం అధ్యక్షుడు గొట్టుముక్కల గాంధీ భగవాన్‌రాజు అన్నారు. బుధవారం పూలపల్లిలో గాంధీరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో ఆక్వా రైతుల సమస్యలు పరిష్కారం కోసం కేంద్ర మంత్రులను కలిసి వినతిపత్రాలను అందించామన్నారు. ముఖ్యంగా నేషనల్ ఫిషరిస్ డెవలప్‌మెంట్ బోర్డు (ఎన్‌ఎఫ్‌డీబీ) ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో ఉందన్నారు. నూతనంగా ఇప్పుడు అమరావతిలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. దీనికోసం స్థలం కూడా కేటాయించారన్నారు. ఎన్‌ఎఫ్‌డీబీ రాష్ట్రంలో రావడం వల్ల రాష్ట్రంలో చేపల ఉత్పత్తి, రొయ్యల పెంపకం, మార్కెటింగ్, ఎగుమతులను పెంచుకోవచ్చన్నారు. అలాగే ఆక్వాకు చెందిన క్వారంటైన్‌ను కూడా వైజాగ్‌లో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జై భారత్ క్షీరారామ ఆక్వా సంఘం అధ్యక్షుడు బోణం చినబాబు, మేడిది జాన్‌రాజు, పెన్మెత్స సత్యనారాయణరాజు తదితరులు పాల్గొన్నారు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): దేశ వ్యవసాయ రంగాన్ని దెబ్బతీసేలా అమెరికాతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవద్దని డిమాండ్ చేస్తూ సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కేఎం) పిలుపు మేరకు బుధవారం పాతబస్టాండ్ సెంటర్‌లోని అంబేద్కర్ విగ్రహం వద్ద రైతు, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ రైతు సంఘం నాయకులు కె. శ్రీనివాస్, పోరండ్ల శ్రీనివాస్, బండి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఈ నెల 24న కేంద్ర ప్రభుత్వం అమెరికాతో చేసుకోనున్న ఈ ఒప్పందం అన్నదాతల పాలిట ఉరితాడుగా మారుతుందని మండిపడ్డారు. దేశవ్యాప్తంగా రైతులు వ్యతిరేకిస్తున్నా కేంద్రం మొండిగా వ్యవహరించడం దుర్మార్గమన్నారు. వెంటనే ఈ ఒప్పందాన్ని విరమించుకోవాలని, 60 ఏళ్లు దాటిన పేద రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులకు నెలకు రూ. 10 వేల పింఛన్ అందించాలని, ఉపాధి హామీ పథకాన్ని పాత పద్ధతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు రాజనాల రామ్మోహనరావు, ఏఐయూకేఎస్ జిల్లా నాయకుడు సిరికొండ రామారావు తదితరులు పాల్గొన్నారు.


