పోలీసులకు చిక్కిన చైన్‌ స్నాచర్‌ | - | Sakshi
Sakshi News home page

పోలీసులకు చిక్కిన చైన్‌ స్నాచర్‌

Jul 23 2026 1:12 AM | Updated on Jul 23 2026 1:12 AM

ఏలూరు టౌన్‌: చేపలు అమ్ముకుంటున్న వృద్ధురాలిని బురిడీ కొట్టించి ఆమె మెడలోని బంగారు గొలుసును అపహరించిన నిందితుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఏలూరు డీఎస్పీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ శ్రావణ్‌ కుమార్‌ కేసు వివరాలను వెల్లడించారు. ఏలూరు రూరల్‌ మండలం లింగారావుగూడేనికి చెందిన సోమమ్మ చేపలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తోంది. ఈ నెల 15న శ్రీపురం వంతెన వద్ద ఆమె చేపలు విక్రయిస్తుండగా, మండవల్లి మండలం బైరవపట్నానికి చెందిన గొల్లు నాగ కార్తీక్‌ అనే యువకుడు చేపలు కొనే నెపంతో వచ్చాడు. ఆమె దృష్టి మళ్లించి మెడలోని 18.43 గ్రాముల బంగారు గొలుసును తెంచుకుని ద్విచక్రవాహనంపై పరారయ్యాడు. వృద్ధురాలి ఫిర్యాదుతో ఏలూరు వన్‌ టౌన్‌ సీఐ రామకృష్ణ, రూరల్‌ ఎస్సై వెంకటేశ్వరరావులు గాలింపు చేపట్టారు. నిందితుడు పారిపోతున్న సమయంలో స్థానిక యువకులు అతడి ఫోటో తీయడం కేసు దర్యాప్తుకు ఎంతో ఉపకరించింది. బుధవారం నిందితుడిని అరెస్ట్‌ చేసిన పోలీసులు, అతడి నుంచి రూ.లక్ష విలువైన బంగారు గొలుసుతో పాటు నేరానికి వాడిన ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. జల్సాలకు అలవాటు పడే ఈ చోరీకి పాల్పడినట్లు తెలిపారు. సమయస్ఫూర్తితో నిందితుడి ఫోటో తీసి కేసు ఛేదనకు సహకరించిన యువకులకు డీఎస్పీ అభినందనలు తెలిపారు. త్వరలోనే వారికి సిటిజన్‌ అవార్డు అందజేస్తామని ప్రకటించారు. చాకచక్యంగా వ్యవహరించి నిందితుడిని పట్టుకున్న సీఐ రామకృష్ణ, ఎస్సై వెంకటేశ్వరరావు, పోలీసు సిబ్బందిని డీఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement