చింతలపూడి (జంగారెడ్డిగూడెం): జీలుగుమిల్లి మండలం దర్భగూడెం గ్రామం నుంచి గుంటూరుకు అక్రమంగా రవాణా అవుతున్న పొగాకు బేళ్లను పొగాకు బోర్డు విజిలెన్స్ అధికారులు చాకచక్యంగా పట్టుకున్నారు. ముందస్తు సమాచారంతో మంగళవారం నిఘా ఉంచిన అధికారులు, దర్భగూడెం–వంకవారిగూడెం రోడ్డు వద్ద వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. దళారులు అక్రమంగా కొనుగోలు చేసి గుంటూరుకు తరలిస్తున్న క్రమంలో ఎలాంటి పర్మిట్లు లేని సుమారు 27 హై గ్రేడ్ పొగాకు బేళ్లను గుర్తించి, వాటిని తక్షణమే సీజ్ చేశారు. అక్రమ రవాణాకు పాల్పడుతున్న వ్యక్తులపై నిబంధనల ప్రకారం కేసు నమోదు చేసి, సీజ్ చేసిన పొగాకును తదుపరి చర్యల నిమిత్తం జంగారెడ్డిగూడెం–2 వేలం కేంద్రానికి తరలించారు. ఈ సందర్భంగా ఎన్‌ఎల్‌ఎస్ రీజనల్ మేనేజర్ జె.సురేంద్ర కుమార్ మాట్లాడుతూ పొగాకు రైతులు ఎవరూ తమ పంట బేళ్లను బయట వ్యక్తులకు, దళారులకు అమ్మకూడదని సూచించారు. ఈ దాడుల్లో పొగాకు బోర్డు విజిలెన్స్ అధికారులు జీఎం కిరణ్, సాయి ప్రశాంత్, ధర్మతేజ పాల్గొన్నారు.


