ఏలూరు టౌన్: ఏలూరు చాటపర్రు రోడ్డు శివకామాక్షి నగర్ ప్రాంతానికి చెందిన కనకం వెంకట సాయి ప్రసాద్ తనకు ప్రాణహాని ఉందని... తనపై ఏలూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో ఇటీవల దాడి జరిగిందంటూ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. నగరపాలక సంస్థ, ఎస్‌ఎంఆర్ నగర్‌కు సంబంధించి అవినీతి అంశాలపై చట్టానికి లోబడి పోరాటం చేస్తున్నానని, ప్రజాహితం దృష్టిలో పెట్టుకుని అవినీతి, అక్రమాలపై ఫిర్యాదు చేశానని పేర్కొన్నారు. ఎస్‌ఎంఆర్ నగర్‌లో రోడ్ల పనులకు సంబంధించి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిందని, ఈ ఉత్తర్వుల కాపీని 2026 జూలై 18న జిల్లా కలెక్టరేట్‌లో అధికారులకు అందజేశానన్నారు. నగరపాలక సంస్థ రెండో అంతస్తులోని సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజినీర్‌కు కాపీ అందజేసి కార్యాలయం మెట్లు దిగుతూ ఉండగా... సీసీ కెమెరాలు లేని ప్రాంతంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు తనను అడ్డగించి, దాడి చేశారని తెలిపారు. భయంతో గట్టిగా అరిచానని, కొందరు ఉద్యోగులు అక్కడికి రావటంతో దాడి చేసిన వ్యక్తులు పారిపోయారని తెలిపారు. ఎస్‌ఎంఆర్ నగర్‌లో అవినీతిపై ఫిర్యాదు చేయటంతో కావాలనే ఎవరో కుట్రపూరితంగా దాడి చేశారన్నారు. తన కుమార్తె, దివ్యాంగుడైన కుమారుడిని పోషించుకోవాల్సిన బాధ్యత తనపై ఉందనీ, ప్రాణహాని జరిగితే కుటుంబం తీవ్ర ఇబ్బందులకు గురవుతుందని, దీనిపై సమగ్ర విచారణ చేయాలని కోరారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): అమెరికాలో జరిగిన ప్రపంచ కప్ ఫుట్‌బాల్ పోటీలు ఏలూరు జిల్లాలోని యువతి, యువకులను ఫుట్‌బాల్ క్రీడ వైపు ఆకర్షించేలా చేశాయని సీనియర్ ఫుట్‌బాల్ క్రీడాభిమాని బెల్లంకొండ కొండయ్య అన్నారు. ఆదివారం అమెరికాలో జరిగిన ఫిఫా వరల్డ్ కప్ ఫుట్‌బాల్ ఫైనల్ పోటీ ముగింపు సందర్భంగా క్రీడాభిమానులు ఏలూరు జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ సభ్యులు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కొండయ్య మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ కలిగిన ఫుట్‌బాల్ క్రీడ భారతదేశంలో సైతం మరింత ప్రజాదరణ సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ పోటీలను ఏలూరు జిల్లాలో క్రీడాభిమానులు, బాలబాలికలు పెద్ద సంఖ్యలో చూశారని సంతోషం వ్యక్తం చేశారు. ్ఠ
సాక్షి, టాస్క్ ఫోర్స్: దెందులూరు గారపాటి హైమావతి దేవి ఉన్నత పాఠశాలలో క్రికెట్ బెట్టింగ్ పోటీలు జరగకుండా చర్యలు తీసుకోవాలని గ్రామానికి చెందిన కానిస్టేబుల్ పోడూరి మధు జిల్లా విద్యాశాఖ అధికారికి సోమవారం ఫిర్యాదు చేశారు. దెందులూరు గ్రామానికి చెందిన ఇద్దరూ వాట్సప్‌లో మెసెజ్‌లు పెట్టి క్రికెట్ బెట్టింగ్ పోటీలు నిర్వహించారన్నారు. గత కొన్ని వారాలుగా దెందులూరు గవర్నమెంట్ హైస్కూల్ లో క్రికెట్ బెట్టింగులు జరుగుతున్నాయని ఆరోపించారు. పోటీలు నిర్వహణకు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, నైట్ వాచ్‌మెన్, ఫిజికల్ డైరెక్టర్ ఎలా అనుమతి ఇస్తారన్నారు. దీనిపై దెందులూరు ఎస్సై డి.వెంకట్ కుమార్ వివరణ కోరగా హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు వడ్లపట్ల విజయకుమార్ దీనిపై ఫిర్యాదు చేశారన్నారు. ఆదివారం హై స్కూల్‌లో తన అనుమతి లేకుండా నిర్వహించారని ఆయన ఫిర్యాదు చేశారన్నారు.


