ఆయిల్‌పామ్‌ గెలల ఏరివేతపై ఆందోళన | - | Sakshi
Sakshi News home page

ఆయిల్‌పామ్‌ గెలల ఏరివేతపై ఆందోళన

Jul 21 2026 12:59 AM | Updated on Jul 21 2026 12:59 AM

ఆయిల్‌పామ్‌ గెలల ఏరివేతపై ఆందోళన చిన్నారిపై అమానుషం

టి.నరసాపురం: బాగా పక్వానికి వచ్చిన ఆయిల్‌పామ్‌ గెలలను సైతం పనికిరావంటూ ఏరివేస్తుండటాన్ని నిరసిస్తూ మండల కేంద్రమైన టి.నరసాపురంలో రైతులు సోమవారం ఆందోళన నిర్వహించారు. స్థానిక నవభారత్‌ ఫ్యాక్టరీకి చెందిన ఆయిల్‌పామ్‌ వే–బ్రిడ్జ్‌ వద్ద ఫ్యాక్టరీ సిబ్బంది రైతులు తీసుకువచ్చిన గెలలను సరిగా పండలేదనే సాకుతో భారీగా పక్కన పడేస్తున్నారు. వైఎస్సార్‌సీపీ నాయకుడు, రైతు ప్రతినిధి దేవరపల్లి సీతారాం ప్రసాద్‌ తీసుకువచ్చిన మూడు టన్నుల గెలల్లో దాదాపు రెండున్నర టన్నుల గెలలను పక్వానికి రాలేదనే నెపంతో తీసుకోకపోవడంతో వివాదం మొదలైంది. దీంతో సీతారాం ప్రసాద్‌తో పాటు పలువురు రైతులు వే–బ్రిడ్జ్‌ వద్ద ధర్నాకు దిగారు. ఫ్యాక్టరీ యాజమాన్యం వచ్చి తగిన సమాధానం చెప్పాలని పట్టుబట్టారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. ఇక్కడ తిరస్కరించిన గెలలనే పక్క మండలాల్లోని ఇతర ఫ్యాక్టరీల వారు కొనుగోలు చేస్తున్నారని, అక్కడ పనికివచ్చిన గెలలు ఇక్కడ ఎందుకు పనికిరావని ప్రశ్నించారు. ఆరుగాలం కష్టపడి పంట పండిస్తే, ఆయిల్‌ రికవరీ శాతం సరిగా లేదంటూ సాకులు చెప్పడం తగదన్నారు. కాయల నుంచి గింజలు రాలిన తర్వాతే కోయాలని ఆంక్షలు విధించడం వల్ల పంట పాడైపోయి తీవ్రంగా నష్టపోతున్నామని వాపోయారు. ఫ్యాక్టరీ యాజమాన్యం గెలల ఏరివేతను తక్షణమే నిలిపివేయాలని, రైతులు నష్టపోకుండా సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

చింతలపూడి (జంగారెడ్డిగూడెం): అల్లారుముద్దుగా చూసుకోవాల్సిన తల్లి, ఆమెతో ఉంటున్న వ్యక్తి కలిసి నాలుగేళ్ల చిన్నారిపై దారుణానికి ఒడిగట్టారు. శరీరంపై వాతలు పెడుతూ చిత్రహింసలకు గురిచేసిన ఘటనపై జంగారెడ్డిగూడెం పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కామవరపుకోట గ్రామానికి చెందిన టి.మహేష్‌శర్మ, కుక్కునూరుకు చెందిన మంజూషలు 2021లో ప్రేమ పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక కుమార్తె (4) ఉంది. కుటుంబ కలహాల కారణంగా కొన్నాళ్ల క్రితం దంపతులిద్దరూ విడిపోయారు. అనంతరం మంజూష జంగారెడ్డిగూడెం ఆర్టీసీ డిపోలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న వెంకట్‌తో పరిచయం ఏర్పడటంతో, అతనితోనే జంగారెడ్డిగూడెంలో ఉంటోంది. ఈనెల 10న తండ్రి మహేష్‌శర్మ కుమార్తెను చూసేందుకు ఆమె చదువుతున్న పాఠశాలకు వెళ్లాడు. చిన్నారి చేతులపై కాలిన గాయాలు, వాతలు ఉండటాన్ని గమనించి ప్రశ్నించగా.. తల్లి మంజూష, వెంకట్‌లు రోజూ తనను కొడుతూ వాతలు పెడుతున్నారని రోదిస్తూ చెప్పింది. పసిపాపపై జరుగుతున్న దారుణాన్ని తెలుసుకున్న తండ్రి వెంటనే జంగారెడ్డిగూడెం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement