మొక్కజొన్న రైతులకు బకాయిలు చెల్లించాలి | - | Sakshi
Sakshi News home page

మొక్కజొన్న రైతులకు బకాయిలు చెల్లించాలి

Jul 21 2026 12:59 AM | Updated on Jul 21 2026 12:59 AM

నూజివీడు: సీడ్‌ మొక్కజొన్నను కొనుగోలు చేసిన కంపెనీలు తక్షణమే రైతులకు డబ్బులు చెల్లించాలని ఆంధ్రప్రదేశ్‌ కౌలు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీ జమలయ్య, ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చలసాని వెంకట రామారావు డిమాండ్‌ చేశారు. సీడ్‌ కంపెనీలు రైతులతో చేసుకున్న ఒప్పందం మేరకు దిగుబడి తగ్గిన రైతులకు ఆ మేరకు నష్టపరిహారం చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. రైతు సంఘం ఆధ్వర్యంలో నూజివీడు సబ్‌ కలెక్టర్‌ ఆఫీస్‌ వద్ద సీడ్‌ మొక్కజొన్న సాగు చేసి నష్టపోయిన రైతులు సోమవారం ధర్నా నిర్వహించారు. ధర్నా అనంతరం సబ్‌ కలెక్టర్‌ బొల్లిపల్లి వినూత్నకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జమలయ్య, రామారావులు మాట్లాడుతూ నూజివీడు మండలంలో సింజెంటా, విజయలక్ష్మి అడ్వెంటా, శ్రీకర, బేయర్‌ తదితర కంపెనీలు పలు గ్రామాల్లో రైతులతో ఒప్పందాలు చేసుకొని ఎకరానికి నాలుగు నుంచి ఐదు టన్నుల దిగుబడి వస్తుందని, టన్నుకు రూ.30 వేలు నుంచి 40 వేలు చెల్లించి కొనుగోలు చేస్తామని నమ్మించి మోసం చేశారన్నారు. ఈ రోజుకు దాదాపు రూ.100 కోట్లపైగా బకాయిలు రైతులకు చెల్లించాలన్నారు. కంపెనీ ప్రతినిధులు చెప్పిన ప్రకారం దిగుబడి రాకపోగా తీవ్రంగా నష్టపోయారన్నారు. దిగుబడి వచ్చిన మేరకు ఆ పంటను కంపెనీ ప్రతినిధులు తీసుకెళ్లి నాలుగు నెలలైనా ఇంతవరకు ఒక్క పైసా చెల్లించకపోవడంతో రైతులు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారన్నారు. డబ్బులు ఇవ్వమని అడిగితే నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని రైతులను నమ్మించి మోసగించిన కంపెనీ యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. సబ్‌ కలెక్టర్‌ స్పందించి రైతులను ఆదుకోవడానికి జూలై 22న రైతులు, కంపెనీ యాజమాన్యాలు, వ్యవసాయ అధికారులతో తక్షణమే సమావేశం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. రైతు సంఘం ఏలూరు జిల్లా ప్రధాన కార్యదర్శి రాయంకుల లక్ష్మణరావు, కౌలురైతుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దొంతు కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement