కై కలూరు: నకిలీ ఆస్తి పత్రాలతో విలువైన ఆస్తిని కాజేయడానికి ప్రయత్నించిన ముఠాను ముదినేపల్లి పోలీసులు అరెస్టు చేసి కోర్టుకు సోమవారం తరలించారు. ఏలూరు డీఎస్పీ డి.శ్రావణ్‌కుమార్ కై కలూరులో వివరాలు వెల్లడించారు. ముదినేపల్లి మండలం ములకలపల్లి గ్రామానికి చెందిన త్రిపురనేని ఏసుబాబు మరణించడంతో ఆమె భార్య వరలక్ష్మీ అమెరికాలో పిల్లల వద్దకు వెళ్ళింది. తిరిగి ఆరు నెలలకు వచ్చింది. అదే గ్రామానికి చెందిన నల్లపు శివ, గోపతాటి మహంకాళి, ఆమె కూతురు కాగితాల కొండమ్మ పేరుతో 2.23 ఎకరాల చేపల చెరువు, 3 సెంట్ల డాబాను నకిలీ డెత్, ఫ్యామిలీ సర్టిఫికెట్లు, ఆధార్ కార్డులను సృష్టించి కై కలూరు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో అక్రమంగా పార్టిషన్ డీడ్, సేల్ డీడ్, గిఫ్ట్ డీడ్‌లను రిజిస్ట్రేషన్ చేయించారు. దీనిపై గత నెల 18న ముదినేపల్లి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. గతంలో త్రిపుననేని ఏసుబాబు వద్ద మహంకాళి, కొండమ్మ భర్త, శివ పనిచేశారు. ఆ సమయంలో ఆస్తి విషయం శివకు ఏసుబాబు చెప్పాడు. దీన్ని ఆసరాగా చేసుకుని ఆయన మరణాంతరం ఏసుబాబు మరో మహిళను వివాహం చేసుకున్నట్లు ఆధార్ కార్డులో ఆమె ఇంటి పేరును త్రిపుననేనిగా మార్చాడు. ఏసుబాబు హైదరాబాదులో మరణిస్తే డెత్ సర్టిఫికెట్ ఏలూరు నుంచి తీసుకున్నారు. దర్యాప్తులో మోసం బయటపడింది.


