అత్తిలి: అత్తిలి రైల్వే స్టేషన్ రోడ్డు తదితర ప్రాంతాలలో రోడ్లపై ఉంచిన ట్రాక్టర్లలో డీజిల్ దొంగతనం చేస్తున్న పెనుగొండకు చెందిన తానేటి ఆశీర్వాదంను అరెస్టు చేసినట్లు అత్తిలి ఎస్సై కేఎన్ విశ్వనాథ్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం రోడ్ల పక్కన ఉంచిన ట్రాక్టర్ల పైపులను కోసి డీజిల్ దొంగతనం చేస్తున్నాడని ఈ విధంగా సుమారు 40 లీటర్ల డీజిల్ దొంగతనం చేశాడన్నారు. ఆశీర్వాదంపై పెనుగొండ, తణుకు తదితర ప్రాంతాల్లో 30కి పైగా కేసులు ఉన్నాయని తెలిపారు.
ముసునూరు: ఆత్మహత్యకు పాల్పడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన మండలంలో జరిగింది. లోపూడికి చెందిన నందిపాము రవి(36) బీటెక్ చదివాడు. మానసిక సమస్యలతో ఇబ్బంది పడేవాడు. బీటెక్ పూర్తి చేసిన తర్వాత వివాహం చేశారు. భార్యతో పొసగక పోవడంతో విడాకులు తీసుకున్నాడు. ఈ నేపథ్యంలో మద్యానికి బానిసయ్యాడు. దీంతో తరచూ కుటుంబంలో గొడవలు జరిగేవి. ఆదివారం మధ్యాహ్నం మద్యంలో పురుగుల మందు కలుపుకుని తాగాడు. స్థానికుల సాయంతో నూజివీడు ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం విజయవాడ తరలించగా చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎం.చిరంజీవి తెలిపారు.


