మృత్యు లోయలుగా చెరువులు | - | Sakshi
Sakshi News home page

మృత్యు లోయలుగా చెరువులు

Jul 20 2026 1:14 AM | Updated on Jul 20 2026 1:14 AM

బాధ్యత ఎవరిది?

20 నుంచి 40 అడుగుల లోతు తవ్వేసిన అక్రమార్కులు

కళ్లముందు కనిపిస్తున్నా పట్టించుకోని అధికారగణం

చాట్రాయి: వ్యాపారమే లక్ష్యంగా చేపట్టిన అక్రమ మట్టి తరలింపుతో మండలంలోని చెరువులు లోయలను తలపిస్తున్నాయి. ఈ గోతులు రేపటి రోజున మృత్యు కూపాలుగా మారే ప్రమాదం ఉంది. మండలంలోని 16 గ్రామ పంచాయతీల్లో గత మూడు నెలలుగా ఇరిగేషన్‌ చెరువుల నుంచి అక్రమంగా మట్టిని తరలించి లక్షల రూపాయల వ్యాపారం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా మట్టిని తరలిస్తున్నా, సంబంధిత అధికారులు ఏమాత్రం పట్టించుకోకపోవడంతో మట్టి మాఫియాకు తిరుగులేకుండా పోయింది. ఎవరైనా ఫిర్యాదు చేస్తే, మనవాడే కదా.. తవ్వేసుకో అన్నట్లుగా వ్యవహరిస్తూ రాత్రి, పగలు తేడా లేకుండా మట్టిని యథేచ్ఛగా తరలించారు.

నిబంధనలకు పాతర

వాస్తవానికి ఇరిగేషన్‌ చెరువుల్లో మట్టిని తరలించాలంటే ఇరిగేషన్‌, మైనింగ్‌, రెవెన్యూ శాఖల అనుమతులు తప్పనిసరి. చెరువులో ఎంత లోతు తవ్వాలో నిబంధనలు ఉంటాయి. వాటిని పక్కన పెట్టి 20 నుంచి 40 అడుగుల లోతులో ఎక్కడ పడితే అక్కడ మట్టిని తవ్వుతున్నారు. వాల్టా చట్టం, కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ లక్షల క్యూబిక్‌ మీటర్ల మట్టిని ఇటుక బట్టీలకు, ప్రైవేట్‌ భూముల అభివృద్ధికి తరలించి, ఒక్కో ట్రాక్టర్‌ మట్టిని రూ.500 నుంచి రూ.600 వరకు అమ్ముకుంటున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఆయా గ్రామాల్లో ఇంటి పన్ను, ఆస్తి పన్ను, నీటి పన్నులు వసూలు చేస్తున్నట్లే, మట్టి, ఇసుక, గ్రావెల్‌ తవ్వకాలపై పన్నులు వసూలు చేస్తే పంచాయతీలకు ఆదాయం వస్తుందని ప్రజలు సూచిస్తున్నారు.

మృత్యు కూపాలు

చనుబండలోని చిన్న చెరువు, పెద్ద చెరువు, పర్వతాపురం చెరువుల్లో తవ్విన గోతులు అత్యంత లోతుగా ఉండటంతో, పొరపాటున ఎవరైనా అందులో పడితే మరణం ఖాయం. ఈ చెరువుల గోతులు నివాస ప్రదేశాల పక్కనే ఉండడంతో ఎవరైనా పొరబాటున గోతిలో పడి చనిపోతే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

చెరువులో తవ్విన గోతులు ప్రమాదాలకు నిలయంగా ఉన్నాయి. గోతుల్లో పడి చనిపోతే ఎవరు బాధ్యత వహిస్తారు. చిన్న చెరువులో తవ్విన గోతులు నివాస ప్రదేశాలకు దగ్గరగా ఉన్నాయి. అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు.

చీదిరాల దుర్గ, చనుబండ, చాట్రాయి మండలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement