బుట్టాయగూడెం: బుట్టాయగూడెం మండలం కామవరం సమీపంలోని అటవీప్రాంతంలో కొలువై ఉన్న గుబ్బల మంగమ్మ గుడికి ఆదివారం భక్తులు పోటెత్తారు. ద్విచక్ర వాహనాలు, ఆటోలు, ప్రత్యేక బస్సుల్లో తెల్లవారుజాము నుంచే భక్తులు అమ్మవారి సన్నిధికి చేరుకున్నారు. అనంతరం ధూపదీప నైవేద్యాలతో అమ్మవారికి పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అధికంగా తరలివచ్చిన భక్తుల వల్ల ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ వారితోపాటు పోలీసులు కూడా బందోబస్తు నిర్వహించారు.
భీమవరం: భీమవరం పట్టణంలోని విస్సాకోడేరు వంతెన సమీపంలో ఆదివారం కారు బీభత్సం సృష్టించింది. పాలకొల్లు వైపు నుంచి భీమవరం వస్తున్న కారు వంతెన సమీపంలోని చికెన్ సెంటర్ నుంచి మోటారుసైకిల్‌పై వస్తున్న యువకుడిని ఢీకొట్టింది. అంతటితో ఆగకుండా పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీకొట్టడంతో విద్యుత్ స్తంభం ముక్కలు కాగా, కారు ముందుభాగం దెబ్బతింది. అనంతరం మట్టిగుట్టను ఢీకొని ఆగిపోయింది. మోటారుసైకిల్‌పై వస్తున్న యువకుడు తీవ్రంగా గాయపడడంతో చికిత్స కోసం ప్రైవేటు ఆసుపత్రికి తరలించినట్లు స్థానికులు తెలిపారు.
కామవరపుకోట: కామవరపుకోట పాతూరులో ఆదివారం మధ్యాహ్నం జరిగిన అగ్నిప్రమాదంలో బాధిత కుటుంబం కట్టుబట్టలతో మిగిలింది. పాతూరు శివారు వాలిసుగ్రీవుల గట్టు వద్ద ఉన్న కాలనీలో నివాసముంటున్న యామండ్ర ప్రసన్న, ఆదివారం ఆమె కుమార్తెను కళాశాలలో దింపి రావడానికి గౌరీపట్నం వెళ్ళింది. ఈ క్రమంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. స్థానికులు గమనించి మంటలను అదుపుచేసే ప్రయత్నం చేశారు. అప్పటికే ఇంట్లోని మంచాలు, టీవీ, ఫ్యాన్లు, దుస్తులు, బంగారు ఆభరణాలు, నగదు, వాటితో పాటు ప్రసన్న కుమార్తె సర్టిఫికెట్లు కాలి బూడిదయ్యాయి. అయితే తమంటే గిట్టనివారే ఇలా చేసి ఉంటారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. జంగారెడ్డిగూడెం సీఐ ఎం.వి.సుభాష్, తడికలపూడి ఎస్.ఐ వల్లీ పద్మ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి, కేసు నమోదు చేసినట్లు తెలిపారు. బాధితులను వైఎస్సార్‌సీపీ నాయకులు తమ్మిశెట్టి గిరిజ, సుబ్రహ్మణ్యం, సాయిన కనకరాజు, టీవీఎస్ రాజు పరామర్శించి దుస్తులు, ఆర్థిక సహాయం అందజేశారు.
తాడేపల్లిగూడెం రూరల్: ట్రాక్టర్ ట్రక్కును బైక్ ఢీకొట్టడంతో ఒక వ్యక్తి మరణించినట్లు రూరల్ ఏఎస్సై గోపీనాథ్ తెలిపారు. కొయ్యలగూడెం మండలం సరిపల్లికి అడ్డగర్ల దుర్గాప్రసాద్ బైక్‌ఫై ఎల్.అగ్రహారం టిడ్కో గృహాల వద్దకు వచ్చాడు. ప్రమాదవశాత్తు ఆగి ఉన్న మున్సిపాల్టీ ట్రాక్టర్ ట్రక్కును ఢీకొన్నాడు. దుర్గాప్రసాద్ తలకు తీవ్రగాయమైంది. అతనిని తాడేపల్లిగూడెం ఏరియా ప్రభుత్వాసుపత్రికి తరలించగా, ఆదివారం తెల్లవారు జామున చికిత్స పొందుతూ మృతి చెందినట్లు రూరల్ పోలీసులకిచ్చిన ఫిర్యాదులో మృతుడి సోదరుడు పృథ్విరాజ్ పేర్కొన్నారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఏఎస్సై తెలిపారు.
పాలకొల్లు సెంట్రల్: పట్టణంలోని నరసాపురం రోడ్డులో ఉన్న మహేశ్వరి టింబర్ డిపోలో అగ్నిప్రమాదం సంభవించింది. ఆదివారం వేకువజామున మంటలు చెలరేగడంతో స్థానికులు అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు.


