జగనన్న కాలనీలో సమస్యల గోడు | - | Sakshi
Sakshi News home page

జగనన్న కాలనీలో సమస్యల గోడు

Jul 20 2026 1:14 AM | Updated on Jul 20 2026 1:14 AM

అధ్వానంగా వీధి రోడ్లు

కరువైన మంచినీటి పైపులైన్లు, డ్రైనేజీ వ్యవస్థ

ఆకివీడు: జిల్లాలోనే అతిపెద్ద కాలనీగా పేరుగాంచిన కుప్పనపూడి శివారు, తాళ్లకోడులోని జగనన్న కాలనీ సమస్యల వలయంలో చిక్కుకుంది. ఈ కాలనీలో సుమారు 1,500కు పైగా కుటుంబాలు నివాసం ఉంటుండగా, మరో 1,000 ఇళ్ల నిర్మాణం కొనసాగుతోంది. గత ప్రభుత్వంలో పేదల ఇళ్ల నిర్మాణానికి నిధులు మంజూరు కావడంతో వెయ్యికి పైగా ఇళ్లు పూర్తయ్యాయి. విద్యుత్‌ సౌకర్యం కల్పించి, ఉచిత కరెంట్‌ కనెక్షన్లు, వీధిలైట్లు ఏర్పాటు చేశారు. ప్రధాన రహదారులను గ్రావెల్‌ రోడ్లుగా నిర్మించినప్పటికీ, అంతర్గత వీధి రోడ్ల పరిస్థితి మాత్రం అగమ్యగోచరంగా ఉందని స్థానికులు మొరపెట్టుకుంటున్నారు.

నీటి కష్టాలు తీరని వైనం

మంచినీటి కోసం ప్రధాన పైప్‌లైన్‌ నిర్మించినప్పటికీ, వీధుల్లో కుళాయి కనెక్షన్ల కోసం పైప్‌లైన్లు వేయలేదు. దీంతో వైర్‌ పైపుల ద్వారా నీటిని తోడుకుంటూ ఇబ్బందులు పడుతున్నారు. పైప్‌లైన్ల విస్తరణకు ఎలాంటి నిధులు మంజూరు కాలేదు. ఇటీవల రెండు మైక్రో ఫిల్టర్లు ఏర్పాటు చేసినా, నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించలేదని స్థానికులు వాపోతున్నారు. కాలనీ కోసం ప్రత్యేకంగా మంచినీటి చెరువును ఏర్పాటు చేసి, ఓహెచ్‌ఎస్‌ఆర్‌ ట్యాంక్‌, పైప్‌లైన్‌ వ్యవస్థను నిర్మించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

వర్షాకాలంలో నరకం

ఇటీవల ప్రధాన రహదారిని సీసీ రోడ్డుగా అభివృద్ధి చేసినప్పటికీ, వర్షం వస్తే అంతర్గత వీధి రోడ్లు జలమయం అవుతున్నాయి. ఆయా రోడ్ల నుంచి ప్రధాన సీసీ రోడ్డుపైకి చేరుకోవడం ప్రమాదకరంగా మారిందని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. కాలనీలో రోడ్లు, డ్రైనేజీలు, మంచినీటి పథకం, చెరువు కోసం భూసేకరణ వంటి కనీస వసతులు కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక గ్రాంట్‌ కేటాయించాలని వారు కోరుతున్నారు.

పన్నుల భారం.. సదుపాయాల శూన్యం

కనీస వసతులు లేని కాలనీలో ఇంటి పన్ను చెల్లించాలని కుప్పనపూడి పంచాయతీ ఒత్తిడి చేస్తోందని నివాసితులు ఆరోపిస్తున్నారు. కుప్పనపూడి పంచాయతీ ద్వారా సరఫరా అవుతున్న నీటికి, కుళాయి పన్ను, ఇంటి పన్ను చెల్లిస్తేనే నీరు ఇస్తామని షరతు విధించడంపై వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

పంచాయతీపై అదనపు భారం

74 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ కాలనీ కుప్పనపూడి గ్రామంపై అదనపు భారంలా మారిందని గ్రామస్తులు, పంచాయతీ పాలకవర్గం ఆందోళన చెందుతోంది. కుప్పనపూడి గ్రామంలో 7,300 మంది జనాభా ఉండగా, ఈ కాలనీ కలపడంతో మొత్తం జనాభా 12 వేలకు చేరింది. అయితే, పంచాయతీకి వస్తున్న ఆదాయం సుమారు రూ.38 లక్షలు మాత్రమేనని, ఈ కొద్దిపాటి నిధులతో ఇంత జనాభాకు మౌలిక సదుపాయాలు కల్పించడం అసాధ్యమని పంచాయతీ పేర్కొంటోంది. ఈ కాలనీని ఆకివీడు నగర పంచాయతీలో విలీనం చేయాలని లేదా కాలనీ అభివృద్ధికి ప్రత్యేక గ్రాంట్లు మంజూరు చేయాలని స్థానికులు, గ్రామ పంచాయతీ అధికారులు ప్రజాప్రతినిధులను కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement