చింతగుంట చెరువులో అక్రమ మట్టి దందా | - | Sakshi
Sakshi News home page

చింతగుంట చెరువులో అక్రమ మట్టి దందా

Jul 20 2026 1:14 AM | Updated on Jul 20 2026 1:14 AM

ఆగిరిపల్లి: మండలంలోని సగ్గూరు గ్రామంలో అధికార పార్టీకి చెందిన నేతలు, అనుమతుల పేరుతో చింతగుంట చెరువులోని మట్టిని ఇష్టానుసారంగా తవ్వేసి అక్రమంగా తరలిస్తున్నారు. అధికారులు ఎవరూ కన్నెత్తి చూడకపోవడం, ఫిర్యాదు కోసం ఫోన్‌ చేసినా స్పందించకపోవడంపై గ్రామస్తులు వాపోతున్నారు. పొలం మెరకల కోసం అనుమతులు తీసుకున్నట్లు చెబుతూ, జేసీబీలతో చెరువును తవ్వి సుమారు 50 ట్రాక్టర్ల ద్వారా వందలాది ట్రిప్పులను పక్కనే ఉన్న వేరే జిల్లాలోని గ్రామాలకు తరలిస్తున్నారు. ఒక్కో ట్రాక్టర్‌ మట్టిని రూ.1000 నుంచి రూ.1200 వరకు విక్రయిస్తున్నారని, దూరాన్ని బట్టి ధరలను పెంచుతున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా, మట్టి ట్రాక్టర్ల రాకపోకలతో చెరువు పక్కనే ఉన్న పొలాలు నాశనమవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా రెవెన్యూ, ఇరిగేషన్‌ అధికారులు స్పందించి, అక్రమంగా మట్టిని తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

ఎర్ర చెరువులో అక్రమ తవ్వకాలు

మండలంలోని నూగొండపల్లిలో టీడీపీ నాయకులు ఎర్ర చెరువును ఇష్టానుసారం తవ్వేశారు. ఆదివారం ఉదయం నుంచి గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు అనుమతులు లేకుండా తవ్వేసి వందలాది ట్రిప్పులను పిన్నమరెడ్డిపల్లి, నూగొండపల్లికి తరలించి జేబులు నింపుకుంటున్నారు. చెరువులను తవ్వేస్తున్నా రెవెన్యూ, ఇరిగేషన్‌ అధికారులు పట్టించుకోలేదని గ్రామస్తులు వాపోతున్నారు. అనుమతి లేకుండా చెరువులను తవ్వేయడంతో పెద్దపెద్ద గోతులు ఏర్పడ్డాయి. దీంతో ప్రమాదాలు పొంచి ఉన్నాయని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. సాయంత్రానికి సంఘటన స్థలానికి చేరుకున్న రెవెన్యూ అధికారులు మట్టి తవ్వకాలను తూతూమంత్రంగా నిలిపేసి మమ అనిపించారు. అనుమతి లేకుండా చెరువులో అక్రమ తవ్వకాలు చేసే వారిపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement