బుట్టాయగూడెం: స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈశా గ్రామోత్సవం పేరిట ఆదివారం ఘనంగా క్రీడాపోటీలను నిర్వహించారు. ఈ పోటీలను కేఆర్‌పురం ఐటీడీఏ డిప్యూటీ డైరెక్టర్ పి.జనార్దన్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు శారీరక, మానసిక వికాసానికి ఎంతో అవసరం అన్నారు. క్రీడల్లో ఓటమి, గెలుపులను సమానంగా స్వీకరించి క్రీడా స్ఫూర్తిని క్రీడాకారులు అలవరచుకోవాలని కోరారు. మరింత ప్రతిభను కనబరిచి రాష్ట్ర స్థాయిలో జరిగే పోటీలకు ఎంపికవ్వాలని ఆకాంక్షించారు. తొలుత క్రీడా జ్యోతిని వెలిగించి డీడీ పోటీలను ప్రారంభించారు. ఉదయం నుంచే ప్రారంభమైన ఈ పోటీలను చూసేందుకు అనేక మంది అధిక సంఖ్యలో హాజరయ్యారు. కళాశాల మైదానం క్రీడా వాతావరణంతో సందడిగా మారింది. ఆదివారం సెలవురోజు కావడంతో విద్యార్థులు కూడా ఈ పోటీలను తిలకించారు. వాలీబాల్, త్రోబాల్ పోటీల్లో ప్రతి మ్యాచ్‌లో ఆటగాళ్లు ప్రదర్శించిన చురుకుదనం, టీమ్ వర్క్ ప్రేక్షకుల నుంచి చప్పట్లు అందుకున్నాయి. ఈ పోటీల్లో సుమారు 38 వాలీబాల్ టీంలు, 8 త్రోబాల్ మహిళా టీంలు పాల్గొన్నాయి. త్రోబాల్ మహిళల విభాగంలో బుట్టాయగూడెం లిటిల్ రోజ్ టీమ్ మొదటి స్థానం, సీతప్పగూడెం రెండో స్థానం, మామిడిగొంది మూడోస్థానం, రాజవరం నాలుగో స్థానంలో నిలిచాయి. మొదటి, రెండు స్థానాల్లో గెలుపొందిన వారు విజయవాడలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననున్నారు. త్రోబాల్‌లో విజేతలైన వారికి కేఆర్‌పురం స్పోర్ట్స్ ఫెడరేషన్ సెక్రటరీ లక్ష్మణ్‌రావు చేతుల మీదుగా నగదు బహుమతులను అందజేశారు. మోస్ట్ జాయ్‌ఫుల్ ప్లేయర్‌గా గొరపర్తి ఝాన్సీని ఎంపిక చేశారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ జి.కుసుమ, నేషనల్ వాలీబాల్ ప్లేయర్ బి.వెంకట్ తదితరులు పాల్గొన్నారు.


