● కోర్టు ఉత్తర్వులతో ఎఫ్‌ఐఆర్
● ఎమ్మెల్యే చింతమనేని అనుచరులు ఆరుగురిపై కేసు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): గతేడాది ఏలూరులో ‘సాక్షి’ కార్యాలయంపై టీడీపీ శ్రేణులు చేసిన దాడి ఘటనకు సంబంధించి ఎట్టకేలకు కేసు నమోదు చేశారు. గతేడాది జూన్ 10న ఎన్‌ఆర్ పేటలోని ‘సాక్షి’ కార్యాలయంపై దాడి జరిగిన క్రమంలో పోలీసులకు ఫిర్యాదు చేస్తే స్పందించలేదు. ఈ క్రమంలో కోర్టులో ప్రైవేటు కేసు దాఖలు చేయగా కోర్టు ఆదేశాలతో పోలీసులు ఈనెల 9న ఆరుగురుపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. కేసుకు సంబంధించి వివరాలు ఇలా.. గతేడాది జూన్ 7న సాక్షి టీవీలో అమరావతి మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణులు సాక్షి కార్యాలయాలపై దాడులకు తెగబడ్డారు. దీనిలో భాగంగా గతే డాది జూన్ 10న ఏలూరు కార్యాలయంపై దాడి చేసి, ఆఫీసు కాంపౌండ్‌లోని ఫర్నిచర్‌ను, ఇతర వస్తువులను దహనం చేసి తీవ్ర భయాందోళనలు సృష్టించారు. దాడి జరిగాక 17న ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని కోరుతూ జిల్లా ఎస్పీ కె.ప్రతాప శివకిషోర్‌కు ఫిర్యాదు చేయడం, పోలీసులు స్పందించకపోవడంతో డీజీపీకి మెయిల్ ద్వారా ఫిర్యాదు పంపి చివరికి న్యాయస్థానంలో ప్రైవేటు కంప్లయింట్ దాఖలు చేశారు. దీంతో ఈ ఏడాది ఏప్రిల్ 24న న్యాయస్థానం ఇరువాదనలు విని ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేసి చట్టప్రకారం పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయాలని ఆదేశించడంతో 9 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. న్యాయ వాది ప్రత్తిపాటి తంబి వాదనలు వినిపించారు.
ఆరుగురిపై ఎఫ్‌ఐఆర్
ఈ కేసులో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అనుచరులు, టీడీపీ నేతలు వై.శివబాబు, గారపాటి రామసీత, దేవరపల్లి ఆదాం, టి.తాతయ్య, గుత్తా అనిల్, కొనకళ్ల శివమణి తదితరులపై ఎఫ్‌ఐఆర్ నమోదైందని న్యాయవాది తంబి తెలిపారు.


