భౌబోయ్‌ ! | - | Sakshi
Sakshi News home page

భౌబోయ్‌ !

Jul 18 2026 3:29 AM | Updated on Jul 18 2026 3:29 AM

భౌబోయ్‌ !

గ్రామాలు, పట్టణాల్లో పెరుగుతున్న దాడులు

బయటకు రావాలంటే వణుకు

ఆకివీడు : ఇటీవల ప్రజలపై కుక్కల దాడుల పెరిగాయి. అనేక మంది దాడిలో తీవ్రంగా గాయపడి వైద్యం పొందుతున్నారు. ప్రాణాల్ని అరచేతిలో పెట్టుకుని జీవించాల్సి వస్తోంది. పీహెచ్‌సీలు, సీహెచ్‌సీల్లో యాంటీ రేబీస్‌ వ్యాక్సిన్‌ వేయించుకుని కాలం గడుపుతున్నారు. మరికొందరు ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. వీధి కుక్కలతో పాటు పెంపుడు కుక్కల దాడులు కూడా పెరిగాయి. రోజురోజుకూ బాధితుల సంఖ్య పెరుగుతున్నా, వీధి కుక్కల నివారణకు అధికారులు ఏవిధమైన చర్యలు తీసుకోవడంలేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం కుక్కకాటుకు మందును సరఫరా చేస్తోంది కానీ, కుక్కల బెడదను తొలగించేందుకు మార్గాలు అన్వేషించడం లేదని ప్రజలు మండిపడుతున్నారు.

లక్షల రూపాయలతో యాంటీ ర్యాబిస్‌ వ్యాక్సిన్లు కొనుగోలు చేసి సరఫరా చేస్తున్న అధికారులు, కుక్కల బెడదను నివారించడంలో మాత్రం విఫలమవుతున్నారు. సమస్యను మూలాల్లోంచి పరిష్కరించడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉండి నియోజకవర్గంలోని 72 గ్రామాల్లో కుక్కల బెడద తీవ్రంగా ఉంది. జిల్లాలో అనేక మంది కుక్కకాటుకు గురై ప్రాణాలు కోల్పోయినా, అధికారులు మాత్రం మొద్దునిద్ర వీడటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రిపూట దొంగల భయం కంటే, కుక్కల భయమే ఎక్కువగా ఉందని స్థానికులు వాపోతున్నారు.

ఒంటరిగా వెళ్లేవారే టార్గెట్‌

కుక్కలు ఒంటరిగా ప్రయాణించేవారిని, ద్విచక్ర వాహనాలపై వెళ్లేవారిని, స్కూళ్లు, కాలేజీలకు వెళ్లే పిల్లల్ని లక్ష్యంగా చేసుకుంటున్నాయి. గుంపులు గుంపులుగా సంచరిస్తూ, వాహన చోదకులను వెంబడించి మూకుమ్మడి దాడి చేస్తున్నాయి. వాహనం వేగంగా నడిపితే, అవి పరుగు పందెంలో పాల్గొన్నట్లు దూసుకువచ్చి మీదపడుతున్నాయి. కుక్కలు వెంబడించినప్పుడు వాహనాన్ని నిలుపుదల చేసి బెదిరిస్తే అవి వెళ్లిపోయే అవకాశం ఉందని స్థానికులు సూచిస్తున్నారు.

నియంత్రణకు చర్యలేవీ?

కుక్కల నియంత్రణకు పంచాయతీలు, నగర పంచాయతీలు తీసుకుంటున్న చర్యలు శూన్యం. కొన్ని గ్రామాల్లో పిచ్చికుక్కలు స్వైర విహారం చేస్తున్నా పట్టించుకునే నాథుడు లేడు. కుక్కల్ని చంపకూడదని గతంలో సుప్రీంకోర్టు తీర్పునిచ్చినప్పటికీ, వాటి నియంత్రణకు చర్యలు చేపట్టాలని స్పష్టం చేసింది. కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించాలని, ఆరోగ్య పరిస్థితుల్ని మెరుగుపరచాలని ఆదేశించింది. ఆ విధమైన చర్యలు లేకపోవడంతో, కుక్కల సంతతి విపరీతంగా పెరిగిపోతోంది. తగినంత ఆహారం అందక, ఆరోగ్య పరిస్థితులు క్షీణించడంతో అవి పిచ్చికుక్కలుగా మారుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement