ఆగిరిపల్లి : తోటపల్లిలో బయో గ్యాస్ ప్లాంట్ ఏర్పాటు పేరుతో మంత్రి పార్థసారథి తన అనుచరులతో కలిసి కోట్లాది రూపాయల విలువైన ప్రకృతి సంపదను అక్రమంగా దోచుకుంటున్నారని మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు ఆరోపించారు. శుక్రవారం తోటపల్లిలో వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు బెజవాడ రాంబాబు ఆధ్వర్యంలో జరిగిన గ్రామస్తుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా తోటపల్లి చెందిన మరియమ్మ, లక్ష్మీ మాట్లాడుతూ, తమ భూములను ప్రభుత్వం లాక్కుని మంత్రి కుమారుడికి అప్పగించిందని, అధికారులు తమ గోడును పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యాలయం లోపలికి కూడా రాకుండా బయటకు వెళ్లగొట్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జువ్వనబోయిన ఆంజనేయులు మాట్లాడుతూ మంత్రి అనుచరుల అక్రమ మైనింగ్‌తో ప్రకృతిని దోచేయడం వల్ల జీవనోపాధి దెబ్బతింటోందని, ప్రశ్నిస్తే కేసులు పెట్టి భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు మాట్లాడుతూ.. గత నెల రోజుల్లోనే సుమారు 5 వేల లారీ ట్రిప్పుల గ్రావెల్‌ను తరలించారని, రాబోయే రెండేళ్లలో 45 వేల ట్రక్కుల ద్వారా రూ. 40 కోట్లు దోచుకోవడానికి మంత్రి యత్నిస్తున్నారని విమర్శించారు. తోటపల్లిలోని దుగ్గిరాల బాల రావమ్మ తల్లి ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందిందని, అమ్మవారి స్థలంలో అక్రమ రవాణా చేస్తున్నారని, కొండ వాగులో అక్రమంగా రోడ్డు వేయడంతో గ్రామం నీట మునిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. మంత్రికి అనుమతులు ఉంటే బహిరంగంగా చూపించాలని, అప్పటివరకు తనే స్వయంగా గ్రావెల్ రవాణా నిలిపివేయాలని డిమాండ్ చేశారు. గత నెల రోజుల నుంచి గ్రావెల్ అక్రమ రవాణా జరుగుతుంటే రెవెన్యూ, మైనింగ్ శాఖ అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. తనపై గత ప్రభుత్వంలో మైనింగ్‌కు పాల్పడ్డానని మంత్రి చేస్తున్న ఆరోపణలను సవాల్ చేస్తున్నానని, అవి నిరూపిస్తే ఏ చర్యకై నా సిద్ధమని స్పష్టం చేశారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశానని తనపై ఇంతవరకు ఒక్క అవినీతి మరక కూడా లేదని, నువ్వు ఎక్కడినుండో వచ్చి నూజివీడు నియోజవర్గాన్ని దోచేసుకుంటున్నావని అన్నారు. జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి ఈ అక్రమాలపై విచారణ జరిపి గ్రామస్తులకు న్యాయం చేయాలని కోరారు. సమావేశంలో డిజిటల్ స్క్రీన్ ద్వారా అక్రమ మైనింగ్ చిత్రాలను గ్రామస్తులకు చూపించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ గుడిమళ్ళ కృష్ణంరాజు, వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు బెజవాడ రాంబాబు, నియోజవర్గ రైతు సంఘం అధ్యక్షుడు ఈలప్రోలు సుబ్బయ్య, మండల ఉపాధ్యక్షుడు కొండవరదల రమేష్, నూజివీడు టౌన్ పార్టీ అధ్యక్షులు శీలం రాము, జెడ్పీటీసీ పిన్నిబోయిన వీరబాబు, నాయకులు అత్తి మురళి పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు ఆరోపణ


