కొయ్యలగూడెం (జంగారెడ్డిగూడెం) : పొగాకు మార్కెట్‌ను గాడిలో పెట్టాలని వర్జీనియా రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఎన్‌ఎల్‌ఎస్ ఏరియా 5 పొగాకు బోర్డుల రైతు సంఘాల ప్రతినిధులు, రైతు నాయకులు గుంటూరులోని ప్రముఖ పొగాకు కంపెనీలైన ఐటీసీ, జీపీఐ, డెక్కన్, పీఎస్‌ఎస్‌హెచ్ ప్రతినిధులను కలిసి ప్రస్తుత మార్కెట్ సంక్షోభంపై చర్చించారు. ఈ సందర్భంగా రైతు నాయకులు మాట్లాడుతూ.. వేలం ప్రారంభమై నాలుగు నెలలు కావస్తున్నా ధరలు దిగజారుతున్నాయే తప్ప పెరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం బేరన్‌కు రూ. 5 లక్షల వరకు నష్టం వస్తోందని, నో–బిడ్‌లు కూడా 40 శాతం తగ్గడం లేదని కంపెనీల దృష్టికి తీసుకెళ్లారు. పండిన పంటలో ఇప్పటివరకు 10 శాతం మాత్రమే అమ్మకాలు జరిగాయని, కావున గత ఏడాది తరహాలోనే క్వింటాకు రూ. 290 గరిష్ట ధర ఇవ్వాలని కోరారు. దీనిపై కంపెనీ ప్రతినిధులు స్పందిస్తూ.. కస్టమర్లు ఆ ధరకు రావడం లేదని, రైతులు లగ్స్, లీఫ్ గ్రేడ్‌లను వేలం కేంద్రాలకు తీసుకువస్తే మార్కెట్ కొంత మెరుగయ్యే అవకాశం ఉందని సూచించారు. కంపెనీల విజ్ఞప్తి మేరకు రైతు సోదరులందరూ లీఫ్ బేళ్లు, ఇతర గ్రేడ్లను వేలం కేంద్రాలకు తీసుకురావాలని రైతు సంఘాల నాయకులు కోరారు. అనంతరం వారు పొగాకు బోర్డు అధికారులను కలిసి సమస్యల పరిష్కారం కోసం వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో వర్జీనియా రైతు సంఘం నాయకులు పరిమి రాంబాబు, కరాటం రెడ్డిబాబు తదితరులు పాల్గొన్నారు.


