సౌర విద్యుత్‌ ప్లాంట్‌ ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

సౌర విద్యుత్‌ ప్లాంట్‌ ప్రారంభం

Jul 17 2026 1:10 AM | Updated on Jul 17 2026 1:10 AM

సౌర విద్యుత్‌ ప్లాంట్‌ ప్రారంభం బావిలో పడిన మహిళను కాపాడిన పోలీసులు బలుసులమ్మ సేవలో కమెడియన్‌ యోగిబాబు వరకట్న వేధింపులపై కేసు భర్త కనిపించడం లేదని భార్య ఫిర్యాదు

తణుకు అర్బన్‌ : ది ఆంధ్రా సుగర్స్‌ లిమిటెడ్‌ సంస్థ సంప్రదాయేతర ఇంధన వనరుల విభాగంలో తమ సొంత అవసరాల వినియోగంలో భాగంగా వెంకటరాయపురం కర్మాగార సముదాయంలో నూతనంగా నిర్మించిన 1.5 మెగావాట్ల సామర్థ్యం కలిగిన సౌర విద్యుత్‌ ప్లాంట్‌ను సంస్థ చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ పెండ్యాల నరేంద్రనాథ్‌ చౌదరి ప్రారంభించారు. గురువారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈ సౌర ఆధారిత విద్యుత్‌ ఉత్పత్తిని తణుకులోని కర్మాగారాల అవసరాలకు వినియోగిస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో సంస్థ జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ పెండ్యాల అచ్యుతరామయ్య, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ పీఎస్‌ఆర్‌వీకే రంగారావు తదితరులు పాల్గొన్నారు.

నూజివీడు: పట్టణంలోని బొందిలీపేటకు చెందిన మహిళ ప్రమాదవశాత్తూ బావిలో పడిపోగా పోలీసులు కాపాడిన సంఘటన గురువారం చోటు చేసుకుంది. వివరాల ప్రకారం బొందిలీపేటకు చెందిన శైలజ అనే మహిళ ప్రమాదవశాత్తు బావిలో పడిపోయింది. ఈ సమాచారాన్ని స్థానికులు వెంటనే పట్టణ పోలీసుస్టేషన్‌కు తెలియజేయగా పట్టణ ఎస్సై–2 నాగేశ్వరరావు తన సిబ్బందితో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని బావిలో పడిపోయి ఉన్న మహిళలను బయటకు తీశారు. దీంతో ఆమె ప్రాణాపాయం నుంచి బైటపడింది. విషయాన్ని తెలుసుకున్న మున్సిపల్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ పగడాల సత్యన్నారాయణ అక్కడకు చేరుకుని వివరాలను తెలుసుకున్నారు.

తాడేపల్లిగూడెం (టీఓసీ): తమిళ, తెలుగు చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రజాదరణ పొందిన ప్రముఖ హాస్య నటుడు, కోలీవుడ్‌ స్టార్‌ కమెడియన్‌ యోగిబాబు తాడేపల్లిగూడెం పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నారు. తాడేపల్లిగూడెం వాసి యూత్‌ పవన్‌ భాసంశెట్టి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో యోగిబాబు నటిస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం పట్టణ ఇలవేల్పు బలుసులమ్మ అమ్మవారిని యోగిబాబు దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ మర్యాదలతో నిర్వాహకులు స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల్లో యోగిబాబు పాల్గొన్నారు. యోగిబాబుకు నిర్వాహకులు అమ్మవారి చిత్రపటాన్ని, తీర్థప్రసాదాలను అందించారు.

టి.నరసాపురం: అదనపు కట్నం కోసం వేధిస్తున్న భర్త, అత్తమామలు, ఆడపడుచుపై గురువారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఎం.జయబాబు తెలిపారు. వివరాల ప్రకారం రాజుపోతేపల్లి గ్రామానికి చెందిన యర్రపాటి భానుశ్రీకి, ఖమ్మం జిల్లా లచ్చన్నగూడెంకు చెందిన అర్చేపల్లి సందీప్‌తో 2020లో వివాహమైంది. పెళ్లి సమయంలో కట్నకానుకలుగా 7 కాసుల బంగారం, 20 తులాల వెండి, రూ.2.50 లక్షల నగదు, ఆడపడుచు కట్నం కింద రూ.20 వేలతో పాటు రూ.1.30 లక్షల విలువైన సారె సామాగ్రి ఇచ్చారు. వివాహమైన కొన్నాళ్లు వీరి సంసారం బాగానే సాగింది. ఆ తర్వాత అదనపు కట్నం తేవాలంటూ భర్త సందీప్‌తో పాటు అత్తమామలు, ఆడపడుచు కలిసి భానుశ్రీని శారీరకంగా, మానసికంగా వేధిస్తూ, చంపుతామని బెదిరించడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే రెండేళ్ల క్రితం ఆమెను, కూతురిని పుట్టింటి వద్ద వదిలేసి వెళ్లారు. తమను కాపురానికి తీసుకెళ్లాలని భానుశ్రీ ఫోన్‌ చేయగా వస్తే చనిపోతానంటూ సందీప్‌ బెదిరింపులకు దిగాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.

భీమవరం: ఇంటి నుంచి వెళ్లిన తన భర్త తిరిగి రాలేదంటూ భార్య పి.కల్పన ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు భీమవరం టూటౌన్‌ ఎస్సై రెహ్మన్‌ గురువారం విలేకరులకు తెలిపారు. పట్టణంలోని ద్రోణంరాజు వారి వీధికి చెందిన పి.లక్ష్మీనర్సింహ ఈ నెల 14న సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. చుట్టుపక్కల, బంధువుల ఇళ్ల వద్ద ఆరా తీసినా ఆచూకీ లభించకపోవడంతో భార్య కల్పన పోలీసులను ఆశ్రయించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement