ఉండి: సరిహద్దు వివాదంలో అధికారుల నుంచి న్యాయం లభించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉండిలో ఓ వ్యక్తి ప్రైవేట్ సెల్ టవర్ ఎక్కి కలకలం సృష్టించాడు. గురువారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో శ్రీనివాస్ అనే వ్యక్తి టవర్ ఎక్కి, కిందకు దూకేస్తానంటూ హల్‌చల్ చేశాడు. ఈ సందర్భంగా టవర్ కింద ఉన్న అతని భార్య త్రివేణి మాట్లాడుతూ మాకు, మా పొరుగువారికీ మధ్య మూడేళ్లుగా సరిహద్దు వివాదం నడుస్తోంది. దీనిపై గత ఏడాది డిసెంబర్‌లో స్పందనలో ఫిర్యాదు చేయగా.. అప్పటి తహసీల్దార్ సమస్యను పరిష్కరించి, ఆ దారి మాదేనంటూ ఎండార్స్‌మెంట్ ఇచ్చారని తెలిపారు. కానీ, ఆ తర్వాత ప్రత్యర్థులు మళ్లీ ఆ దారి మాదేనంటూ మాపై హక్కులు చెలాయిస్తూ తన భర్తను తీవ్రంగా కొట్టారని ఆరోపించింది. దీనిపై పోలీసులకు, అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయిందని, దాడి చేసిన వారికి అధికార పార్టీ నాయకుల అండదండలు ఉండటంతో మాకు ఎవరూ న్యాయం చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. అయితే వ్యక్తి టవర్ ఎక్కాడన్న సమాచారం అందుకున్న తహసీల్దార్ మంతెన రామప్రసాదరాజు, ఎంపీడీఓ శ్రీనివాస్, సీఐ కాళీచరణ్, ఎస్సై హెచ్.మల్లికార్జున, పంచాయతీ కార్యదర్శి అనిల్ తదితరులు ఫైర్ ఇంజన్‌తో సహా ఘటనా స్థలానికి చేరుకున్నారు. టవర్ పై ఉన్న శ్రీనివాస్‌తో పాటు ఇరుపక్షాలతో అధికారులు చర్చలు జరిపారు. న్యాయం చేస్తామని అధికారులు నచ్చజెప్పడంతో రాత్రి 8 గంటల సమయంలో శ్రీనివాస్ సురక్షితంగా కిందకు దిగాడు. అనంతరం ఇరువర్గాల డాక్యుమెంట్లు పరిశీలించి పూర్తి స్థాయిలో విచారణ జరిపి తగిన న్యాయం చేస్తామని తహసీల్దార్ హామీ ఇచ్చారు.


