ఆగిరిపల్లి: మామిడి తోటల్లో శాసీ్త్రయ యాజమాన్య పద్ధతులు పాటించడం ద్వారా అధిక దిగుబడులు సాధించవచ్చని నూజివీడు మామిడి పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ శాలిరాజు సూచించారు. మండలంలోని వడ్లమాను గ్రామంలో మామిడి రైతులకు శాసీ్త్రయ సాగు విధానాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ శాలిరాజు మాట్లాడుతూ పాత తోటల్లో ఎండిపోయిన కొమ్మలను తొలగించి, చెట్లను గొడుగు ఆకారంలో కత్తిరించుకోవాలన్నారు. సమతుల్య ఎరువులు, సూక్ష్మపోషకాల వినియోగంతో పాటు అంతర పంటల సాగు ద్వారా రైతులు అదనపు ఆదాయం పొందవచ్చని వివరించారు. అలాగే, తెగుళ్లు, పురుగుల నివారణకు సమగ్ర సస్యరక్షణ చర్యలు, సేంద్రియ పద్ధతులు పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యానవన శాఖ అధికారి కె. షాజా నాయక్, మండల ఉద్యానశాఖాధికారిణి కె. జ్యోతి ప్రియాంక, వీహెచ్‌ఏ నాగాంజనేయులు, ఆర్‌ఎస్‌కే ఇన్‌చార్జులు మరియు స్థానిక రైతులు పాల్గొన్నారు.


