జంగారెడ్డిగూడెం: గుర్వాయిగూడెం శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి ఆలయంలో భక్తుల సౌకర్యార్థం 8 గదులతో శ్రీ రామ సదనం పేరుతో నిర్మించనున్న విశ్రాంతి భవనానికి భారీ విరాళం అందించారు. జంగారెడ్డిగూడెంకు చెందిన అబ్బిన దత్తాత్రేయ, సత్యవతి దంపతులు తమ కుమారుడు సునీల్ కుమార్, కోడలు మనోరమ తరఫున ఒక గదికి అయ్యే ఖర్చు రూ. 9,99,999 అందజేశారు.
మండవల్లి: మండలంలోని చావలిపాడులో రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడు. రాచపట్నం గ్రామానికి చెందిన అందుగల పరసయ్య (50) పోలుకొండలో రొయ్యల చెరువుపై సూపర్ వైజర్‌గా పనిచేస్తున్నాడు. బుధవారం ఉదయం 5 గంటలకు పరసయ్య తన బైక్‌పై ఇంటి నుంచి పనికి బయలుదేరాడు. చావలిపాడు కాలనీ రోడ్డులో వెళ్తుండగా, ఉదయం 5:40 గంటల సమయంలో వెనుక నుండి వచ్చిన ట్రాక్టర్ బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పరసయ్య రోడ్డుపై పడిపోగా, ట్రాక్టర్ వెనుక చక్రం అతని వీపుపై నుంచి వెళ్ళడంతో తీవ్ర గాయాలై సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు.
భీమవరం: సిగిడీల పేటలో లోఓల్టేజ్ విద్యుత్ సమస్య ఉండడంతో అక్కడికి వెళ్లిన విద్యుత్‌శాఖ ఉద్యోగులు ఆకులు సతీష్, ఎ.సునీతను స్థానికులు కొట్టడంతో కేసు నమోదుచేసినట్లు భీమవరం వన్‌టౌన్ సీఐ ఎ రమేష్ చెప్పారు. పరిశీలించడానికి బుధవారం వెళ్లగా వీర సూర్యచంద్రరావు, లక్ష్మణరావు గాయపర్చినట్లు సతీష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసినట్లు సీఐ చెప్పారు.


