ఆంధ్రా కాల్వను బాగు చేయాలి | - | Sakshi
Sakshi News home page

ఆంధ్రా కాల్వను బాగు చేయాలి

May 4 2026 7:07 AM | Updated on May 4 2026 7:07 AM

చింతలపూడి: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఆంధ్రా కాల్వ మరమ్మతు పనులకు నిధులు కేటాయించాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. కాల్వపై ఆధారపడి ఉన్న పంట కాల్వలను కూడ మరమ్మతులు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. వర్షాకాలానికి ముందే పూడిక తీసి బాగు చేసుకుంటే సాగు నీరు చివరి పొలాలకు కూడ చేరడానికి అవకాశం ఉంటుందని అంటున్నారు. చింతలపూడి మండలం రాఘవాపురం ఇరిగేషన్‌ సెక్షన్‌ పరిధిలో ఉన్న ఆంధ్రా కాల్వ పూడుకుపోయి దశాబ్దాలు దాటింది. అనేక చోట్ల గండ్లు పడ్డాయి. అవి పూడ్చమని ఆయకట్టు రైతులు సంవత్సరాలుగా మొర పెట్టుకుంటున్నా పూడ్చడం లేదు. దీంతో ఏటా వరద నీరు పంటపొలాలపై నుంచి ప్రవహించి వృథాగా పోతూంది. 1967లో ఏలూరు జిల్లాలోని మెట్ట ప్రాంతంలో 21 చెరువులకు సాగు నీరు అందించడానికి ఖమ్మం జిల్లా ,తుమ్మూరు వద్ద ఆనకట్ట నిర్మించారు. అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని చింతలపూడి మండలంలో 18 కిలోమీటర్ల పొడవున కాల్వ నిర్మాణం చేపట్టి వరద నీటిని సాగునీటి చెరువులకు మళ్ళిస్తున్నారు. మండలంలో దాదాపు 11 వేల ఎకరాలకు అధికారికంగాను, అనధికారికంగా మరో 10 వేల ఎకరాలకు ఏటా సాగునీరు అందుతోంది. దీంతో పాటు జిల్లాలోని చింతలపూడి మండలం, నాగిరెడ్డిగూడెం వద్ద నిర్మించిన తమ్మిలేరు ప్రాజెక్టు సైతం ఆంధ్రా కాల్వ ద్వార వచ్చే వరద నీటిపై ఆధారపడి ఉంది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో 2023లో అప్పటి ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్‌బాబు ఆంధ్రా కాల్వ మరతుత్తులకు తన పార్లమెంట్‌ నిధుల నుంచి 30 లక్షలు కేటాయించారు. దీంతో కొంత మేర మరమ్మతు పనులను పూర్తి చేశారు. మిగిలిన నిధులు మంజూరు చేసి కాల్వను మరమ్మతు చేయాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement