అలరించిన నాటికలు | - | Sakshi
Sakshi News home page

అలరించిన నాటికలు

May 4 2026 7:07 AM | Updated on May 4 2026 7:07 AM

అలరించిన నాటికలు

యలమంచిలి: కొంతేరు గ్రామంలోని శ్రీ పులపర్తి వీరాస్వామి యూత్‌ క్లబ్‌ కళామందిర్‌ ఆధ్వర్యంలో జరుగుతున్న 44వ అఖిల భారత స్థాయి నాటిక పోటీల ముగింపు రోజైన ఆదివారం రెండు నాటికలు ప్రదర్శించారు. మొదటి నాటిక మనిషి వ్యక్తిత్వం గురించి, రెండవ నాటిక వివాహ బంధం ప్రాశస్త్యం గురించి సాగి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మూడో రోజు నాటక ప్రాంగణానికి భీమవరం పట్టణానికి చెందిన దివంగత తిరుమల కామేశ్వరరావు పేరును నామకరణం చేశారు. ప్రతి మనిషి జీవితంలో ఒక లక్ష్యం ఏర్పరచుకుని, దాని సాధనకు రాజీ పడకుండా ఎలా కృషి చేయాలో గుంటూరు అభినయ ఆర్ట్స్‌ వారు ప్రదర్శించిన ‘ఇది అతని సంతకం’ నాటికలో అద్భుతంగా చూపారు. ఈ నాటిక దర్శకుడు ఎన్‌. రవీంద్రరెడ్డి కథానాయకుడు కృష్ణమూర్తి పాత్రలో నటిస్తూ, జీవిత చరమాంకంలో భార్యాభర్తలు ఎలా ప్రణాళికాబద్ధంగా జీవించాలో చూపించారు.

మరో నాటికగా విశాఖపట్నం చైతన్య కళా స్రవంతి వారిచే ‘అగ్ని సాక్షి’ ప్రదర్శితమైంది. వివాహ బంధం పవిత్రమైనదని, అందులో ప్రణయం ఉండాలి తప్ప తప్పుడు అడుగులు వేస్తే ప్రళయం తప్పదని రచయిత మాడభూషి దివాకర్‌బాబు, దర్శకుడు పి. బాలాజీ నాయక్‌ కళ్లకు కట్టినట్లు చూపారు. ఈ పోటీల నిర్వహణలో యూత్‌ క్లబ్‌ కార్యవర్గ సభ్యులు అంబటి మురళీకృష్ణ, గంటా ముత్యాలరావు, బోణం రవిబాబు, జక్కంశెట్టి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement