ముగిసిన వైశాఖ మాస బ్రహ్మోత్సవాలు
ద్వారకాతిరుమల: శ్రీవారి వైశాఖమాస దివ్య బ్రహ్మోత్సవాలు ఆదివారంతో ముగిశాయి. ఉదయం స్వామి, అమ్మవార్లకు వసంతాలను సమర్పించి, చూర్ణోత్సవాన్ని వైభవంగా నిర్వ హించారు. స్వామివారిని కీర్తిస్తూ అర్చకులు, మహిళా భక్తులు వడ్లు దంచారు. ఆ తరువాత రాజాధిరాజ వాహనంపై శ్రీవారికి తిరువీధి సేవను నిర్వహించి, భక్తులకు వసంతాలను అందజేశారు. రాత్రి ఆలయంలో స్వామి వారికి ద్వాదశ కోవెల ప్రదక్షిణలు, శ్రీపుష్ప యాగోత్సవాన్ని అర్చకులు, పండితులు వైభవోపేతంగా నిర్వహించారు.
ద్వాదశ కోవెల ప్రదక్షిణలు : ఉభయ దేవేరులతో శ్రీవారికి రాత్రి ఆలయంలో 12 ప్రదక్షిణలు, 12 సేవా కాలాలు, 12 రకాల పిండి వంటలతో నివేదనలు జరిపారు. అందులో అర్చకులు, పండితులు, భక్తులు, అధికారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఒక్కో ప్రదక్షిణకు ఒక్కో సేవాకాలాన్ని నిర్వహించారు. అనంతరం శ్రీపుష్ప యాగోత్సవాన్ని వైభవోపేతంగా జరిపారు. ఆలయ ముఖ మండపంలో శయన మహావిష్ణువు అలంకారంలో ఉన్న స్వామివారిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించారు. అలాగే శ్రీహరి కళాతోరణ వేదికపై నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
నేటి నుంచి ఆర్జిత సేవలు : శ్రీవారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఆలయంలో రద్దు చేసిన నిత్యార్జిత కల్యాణాలు, ఆర్జిత సేవలను సోమవారం నుంచి పునరుద్ధరిస్తున్నట్టు ఆలయ ఈఓ వేండ్ర త్రినాథరావు తెలిపారు.


