దెందులూరు: ‘పోతునూరు పీహెచ్‌సీలో వైద్యుల కొరత’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురించిన కథనానికి జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు స్పందించారు. పోతునూరు పీహెచ్‌సీకి అమరావతి డైరెక్టరేట్ నుంచి డాక్టర్ వెంకట రాకేష్, గుండుగొలను పీహెచ్‌సీ నుంచి డాక్టర్ శరణ్య వైద్యాధికారులుగా నియమితులయ్యారు.
ఏలూరు (టూటౌన్): ఏలూరు నగర పాలక సంస్థలో పని చేస్తున్న దాదాపు వెయ్యి మంది మున్సిపల్ ఆప్కాస్ కార్మికులకు మార్చి నెల జీతాలు వెంటనే చెల్లించాలని ఏపీ మున్సిపల్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఏలూరు నగర కమిటీ మున్సిపల్ కమిషనర్‌ను కలిసి బుధవారం వినతిపత్రం సమర్పించింది. ఈ సందర్భంగా యూనియన్ గౌరవాధ్యక్షుడు బి.సోమయ్య మాట్లాడుతూ ప్రతి నెలా ఒకటి, రెండో తేదీల్లో వచ్చే మున్సిపల్ ఆప్కాస్ కార్మికుల జీతాలు నేడు ఎనిమిదో తేదీన కూడా రాలేదని అన్నారు. దానివల్ల మున్సిపల్ ఆప్కాస్ కార్మికులు చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. తక్షణమే మార్చి నెల బకాయి జీతాలు ఇప్పించాలని ఆయన కోరారు. మున్సిపల్ కమిషనర్ ఏ భానుప్రతాప్ మాట్లాడుతూ ఈ సమస్య రాష్ట్ర వ్యాప్తంగా ఉందని, సాంకేతిక కారణాలవల్ల జీతాలు పడలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో మాట్లాడామని.. ఒక వారంలోగా మున్సిపల్ కార్మికుల జీతాలు చెల్లిస్తామని తెలిపారు. కార్యక్రమంలో అధ్యక్షుడు లావేటి కృష్ణారావు, కార్యదర్శి జి.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): రెండో విడత జేఈఈ మెయిన్స్ పరీక్షలు బుధవారం నాటితో ముగిశాయి. పరీక్షల చివరి రోజు బుధవారం 581 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఏలూరు నగరంలోని సిద్ధార్థ క్వెస్ట్ స్కూల్‌లో మధ్యాహ్నం సెషన్ పరీక్షకు 122 మందికి గాను 115 మంది, తాడేపల్లిగూడెం వాసవిలో 180 మందికి గాను 176 మంది, శశి ఇంజనీరింగ్‌లో 113 మందికి గాను 109 మంది, భీమవరం విష్ణు ఇంజనీరింగ్‌లో 100 మందికి గాను 97 మంది, డీఎన్‌ఆర్ కళాశాలలో 88 మందికి గాను 84 మంది హాజరయ్యారు.
ద్వారకాతిరుమల: శ్రీవారి రూ.200 నకిలీ దర్శనం టికెట్ల స్కామ్ కేసులోని నిందితులను పోలీసులు గురువారం కోర్టులో హాజరు పరచనున్నారు. ఈ క్రమంలో 7 గురు నిందితులను బుధవారం సాయంత్రం ద్వారకాతిరుమల పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అందులో ఒక సెక్యూరిటీ గార్డు, అలాగే ఇటీవల విధుల నుంచి తొలగించబడిన దేవస్థానం సెక్యూరిటీ సూపర్ వైజర్ ఉన్నారు. ఇదిలా ఉంటే భీమడోలు సీఐ పి.కృష్ణ, స్థానిక ఎస్సై టి.సుధీర్ నిందితుల వివరాలను దేవస్థానం నుంచి సేకరించారు. అలాగే ఒక ప్రింటర్‌ను స్వాధీనం చేసుకున్నారు. విలేకర్ల సమావేశం అనంతరం వీరందరినీ గురువారం కోర్టులో హాజరుపరచనున్నారు.
ఏలూరు (టూటౌన్): లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని, పాత చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఇఫ్ట్యూ ఏలూరు నగర కమిటీ ఆధ్వర్యంలో ఏలూరు పాత బస్టాండ్ సెంటర్‌లో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నగర ప్రధాన కార్యదర్శి యర్రా శ్రీనివాసరావు అధ్యక్షత వహించగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి బద్దా వెంకట్రావు మాట్లాడారు. అనేక పోరాటాలు, త్యాగాలు చేసి సాధించుకున్న కార్మిక చట్టాలను బీజీపీ సర్కార్ తుంగలో తొక్కి.. కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా నాలుగు లేబర్ కోడ్‌లను తీసుకువచ్చిందన్నారు. వీటిని రద్దు చేసేవరకు కార్మిక వర్గం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బి.సోమయ్య, ఇఫ్ట్యూ ఏలూరు నగర సహాయ కార్యదర్శి ముంగము అప్పారావు, పల్లి గంగరాజు, పీడీఎస్‌యూ జిల్లా ప్రెసిడెంట్ కాకి నాని, బాడిత వీరభద్రం, ఇఫ్ట్యూ నగర సహాయ కార్యదర్శి ఎం.విజయలక్ష్మి, ఏలూరు ఏరియా పెయింటింగ్ వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ లొట్ల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.


