నకిలీల డొంక కదిలింది | - | Sakshi
Sakshi News home page

నకిలీల డొంక కదిలింది

Apr 8 2026 7:14 AM | Updated on Apr 8 2026 7:14 AM

న్యూస్‌రీల్‌

డ్యూటీ వేసినందుకు రూ. 20 వేలట..

బుధవారం శ్రీ 8 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2026

ద్వారకాతిరుమల: శ్రీవారి రూ.200 నకిలీ దర్శనం టికెట్ల స్కాం కేసు దర్యాప్తు తుది దశకు చేరుకుంది. పోలీసులు తీగ లాగితే డొంకంతా కదిలింది. ఇప్పటికే ఈ కేసులో ఏడుగురు అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను నిందితులుగా గుర్తించినట్టు తెలుస్తోంది. మరింత లోతుగా విచారణ జరిగితే మరికొందరి పాత్రలు బయటపడే అవకాశం ఉంది. ఆ దిశగా పోలీసులు విచారణ జరుపుతారా.. లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చిన వెంకన్న ఆలయంలో గతనెల 15న రూ.200 నకిలీ దర్శనం టికెట్ల విక్రయాలు బయటపడ్డాయి. దీనిపై ఆలయ ఈఓ వై.భద్రాజీ ఫిర్యాదు మేరకు ఎస్సై టి.సుధీర్‌ దేవస్థానం అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి ఐఎస్‌జే రాజు, సెక్యూరిటీ గార్డు మేకా సతీష్‌పై కేసు నమోదు చేశారు. విచారణలో భాగంగా మరో అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి ఎస్‌.శేషు బాబును అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. అనంతరం శేషు బాబును, సతీష్‌ను కోర్టుకు హాజరు పరచి, రిమాండ్‌కు తరలించారు.

పోలీసుల అదుపులో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి

యలమంచిలి సమీపంలో ఐఎస్‌జే రాజును పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. విచారణలో రాజు పలు విషయాలు వెల్లడించాడు. దేవస్థానం అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి రమేష్‌ తాడేపల్లిగూడెంలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ అయిన తన స్నేహితుడి వద్ద నకిలీ టికెట్లకు సంబంధించిన సాఫ్ట్‌వేర్‌ తయారు చేయించినట్టు తెలుసుకున్నారు. దాంతో రమేష్‌తో పాటు, సాఫ్ట్‌వేర్‌ (బెంగుళూరు) ఉద్యోగిని, అవుట్‌ సోర్సింగ్‌లో హార్డ్‌వేర్‌గా పనిచేస్తున్న శ్రీను అనే వ్యక్తిని సైతం పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఇంతవరకు ఈ కేసులో ఏడుగురు అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను నిందితులుగా గుర్తించినట్టు తెలుస్తోంది. సెక్యూరిటీ, ఇతర సిబ్బంది కూడా ఉన్నట్టు సమాచారం.

సెల్‌ఫోన్‌లో పంపకాల చిట్టా

పోలీసులు ఐఎస్‌జే రాజు వద్ద స్వాధీనం చేసుకున్న సెల్‌ఫోన్‌ నుంచి మరింత సమాచారాన్ని సేకరించారు. నకిలీ టికెట్ల విక్రయాల ద్వారా వచ్చిన నగదును నిందితులు వాటాలు వేసుకుని పంచుకున్నారు. ఆ తరువాత ఆ లెక్కలను వారు వాట్సప్‌ల ద్వారా షేర్‌ చేసుకున్నట్టు గుర్తించారు. పంపకాల్లో ఉన్న ప్రతి ఒక్క ఉద్యోగి నిందితుడిగా ఉన్నట్టు తెలుస్తోంది. పోలీసులు సాఫ్ట్‌వేర్‌ ఉన్న పెన్‌డ్రైవ్‌ను, ఓ ల్యాప్‌ట్యాప్‌ను నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం.

తుదిదశకు చేరిన శ్రీవారి దర్శనం టికెట్ల కేసు దర్యాప్తు

ఏడుగురు అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల పాత్ర ఉన్నట్టు గుర్తింపు

పోలీసుల అదుపులో సాఫ్ట్‌వేర్‌ తయారు చేసిన ఇంజినీర్‌

ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్న శేషుబాబును మూడు నెలల క్రితం రూ.200 టికెట్‌ కౌంటర్‌ నుంచి మరో చోటికి మార్చారు. మరుసటి రోజే మళ్లీ అతడిని రూ. 200 కౌంటర్‌లో నియమించారు. ఇలా డ్యూటీ మార్చేం దుకు ఎస్టాబ్లిష్‌మెంట్‌ గుమస్తాకి రూ.20 వేలు ఇచ్చినట్టు శేషుబాబు పోలీసుల విచారణలో తెలిపాడు. సిబ్బంది విధుల కేటాయింపులో జరిగిన అవకతవకలపై చర్యలు తీసుకోవాలని దేవస్థానం ఈఓకి లెటర్‌ రాసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement