సాక్షి టాస్క్‌ఫోర్స్: అన్యాయాలను ప్రశ్నించడానికి పిడికిలి ఎత్తామని పదే పదే చెప్పుకుంటున్న జనసేన పార్టీ కై కలూరు నియోజకవర్గంలో తన ఉనికిని కోల్పోతోంది. పార్టీ గుర్తుల చొక్కాలతో ఎంచక్కా దౌర్జన్యాలు, ఇసుక దోపిడి, కోడిపందేలు, పేకాట కోర్టు కేసులతో కొందరు చెడ్డ పేరు తెస్తున్నా కట్టడి చేసే ప్రయత్నం అధిష్టానం చేయడం లేదు. కొందరు చేసే తప్పును అందరిపై రుద్దవద్దంటూ సోషల్ మీడియా వేదికగా జనసేన నాయకులు నెత్తినోరు బాదుకుంటున్నారు. బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ నీడగా మారిన జనసేన కార్యకర్త వల్ల మొత్తం పార్టీ అభాసుపాలవుతున్నా ప్రశ్నించడానికి ఎవరూ ముందుకు రావడం లేదు.
రెండు జనసేన పార్టీ కార్యాలయాలు
జనసేన పార్టీలో ఆధిపత్య పోరుకు నిదర్శనంగా నియోజకవర్గ పార్టీ జనసేన కార్యాలయాలు నిలుస్తున్నాయి. కై కలూరు పోస్టాఫీసు ఎదురుగా జనసేన నియోజకవర్గ ప్రధాన పార్టీ కార్యాలయం ఉంది. అదే విధంగా ఆటపాకలో జనసేన ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ ఇంటి వద్ద కై కలూరు నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయం కొనసాగుతోంది. మీడియా సమావేశాలను సైతం విడివిడిగా నిర్వహిస్తున్నారు. ఇటీవల అమరావతిపై పార్లమెంటులో బిల్లు ఆమోదంపై కై కలూరు జనసేన పార్టీ కార్యాలయంలో దీపాలు వెలిగించి హడావిడి చేశారు. బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ వెంట తిరిగే జనసేన నాయకులు ఒక వర్గంగా, జనసేన ఎమ్మెల్సీ జయమంగళతో కలసి ఉంటున్న నాయకులు మరో వర్గంగా ఇక్కడ పార్టీ తయారైందంటూ చర్చ జరుగుతోంది.
ఇన్‌చార్జి నియామకంపై అధిష్టానం వెనకడుగు
కై కలూరు నియోజకవర్గంలో జనసేన ఇన్‌చార్జిని నియమించడానికి పార్టీ అధిష్టానం వెనకడుగేస్తోంది. ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ గతంలో ప్రజారాజ్యం పార్టీలో ఎమ్మెల్యేగా పోటీ చేశారు. దీంతో చిరంజీవి కుటుంబంతో అవినాభావ సంబంధాలు ఉన్నాయి. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కామినేని మాట కాదనరు. ఏలూరు ఇన్‌చార్జి మంత్రి నాదెండ్ల మనోహర్‌తో మంచి పరిచయాలు ఉన్నాయి. ఈ కారణాలతో బీజేపీ, టీడీపీ స్నేహబంధాన్ని దెబ్బతీయవద్దనే ధోరణితోనే జనసేన అదిష్టానం వ్యవహరిస్తోంది. కనీసం జనసేన పార్టీ మండల కమిటీలను సైతం నియోజకవర్గంలో వేయలేకపోతుంది. మాకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు వస్తుందని కష్టపడిన జనసేన యువత ఇప్పుడు ఉసూరుమంటోంది.
కైకలూరు పోస్టాఫీసు ఎదుట జనసేన పార్టీ మరో కార్యాలయంలో నాయకులు
నియోజకవర్గంలో రెండు పార్టీ కార్యాలయాలు
మౌనం వహిస్తున్న జనసేన ఎమ్మెల్సీ జయమంగళ
నియోజకవర్గ బాధ్యతలు అప్పగించని అధిష్టానం
ఎమ్మెల్యే కామినేని నీడగా మారిన వ్యక్తికే పనులు
పార్టీకి ఫిర్యాదులు వెళ్లినా కనీసం ప్రశ్నించని నాయకత్వం


