దెందులూరు: స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో ఫ్యాన్లకు మంగళవారం మరమ్మతులు చేయించారు. సీహెచ్‌సీలో ఉన్న 3 ఫ్యాన్లు మరమ్మతులకు గురవడంతో ఆస్పత్రి సిబ్బంది, రోగులు పడుతున్న అవస్థలపై ‘ఫ్యాన్లు రిపేరు చేయించరూ..’ శీర్షికన సాక్షి కథనం ప్రచురించింది. దీనిపై స్పందించిన సీహెచ్‌సీ సూపరింటెండెంట్ డాక్టర్ సుందర్‌బాబు రోగులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నారు. వెంటనే మూడు ఫ్లాన్లకు మరమ్మతులు చేయించారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఇటీవల నిర్వహించిన ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షలకు సంబంధించి విద్యార్థులు రాసిన జవాబు పత్రాల మూల్యాంకనంను జాగ్రత్తగా ఎటువంటి తప్పులకు తావు లేకుండా పూర్తి చేయాలని ఇంటర్మీడియెట్ విద్యా మండలి కార్యదర్శి రంజిత్ బాషా ఆదేశించారు. మంగళవారం స్థానిక కోటదిబ్బలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో జరుగుతున్న మూల్యాంకన కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు. ఏలూరు జిల్లాలో ప్రస్తుతం అన్ని సబ్జెక్టుల మూల్యాంకనం పూర్తయిందని, ఇంగ్లీష్ సబ్జెక్టు మూల్యాంకనం బుధవారంతో పూర్తవుతుందని తెలిపారు. ఈ సందర్భంగా మూల్యాంకన కేంద్రం స్ట్రాంగ్ రూమ్, స్కానింగ్ రూమ్‌లను తనిఖీ చేసి శిబిరం అధికారి కే యోహాన్‌కు, ఇతర అధికారులకు తగిన సూచనలు ఇచ్చారు. అనంతరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు జరుగుతున్న తరగతులను పరిశీలించారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కోర్టులో వినియోగం నిమిత్తం రిజిస్టర్లు, బ్రౌన్ పేపర్లు, కంప్యూటర్ పేపర్లు వంటి స్టేషనరీ వస్తువులు కొనుగోలు చేసేందుకు సీల్డ్ టెండర్లు కోరుతున్నట్లు జిల్లా జడ్జి ఎస్.శ్రీదేవి ఒక ప్రకటనలో తెలిపారు. నమూనా కాగితాలతోపాటు సీల్డ్ టెండర్ కొటేషన్లు ప్రిన్సిపాల్ డిస్ట్రిక్ట్ కోర్ట్, ఏలూరు చిరునామాకు కార్యాలయ పనిదినాలలో ఈ నెల 18 సాయంత్రం 5 గంటలలోపు అందేలా పంపాలన్నారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): రెండో విడత జేఈఈ మెయిన్స్ పరీక్షల ఐదో రోజు మంగళవారం 465 మంది విద్యార్థులు హాజరయ్యారు. 5వ రోజు పరీక్షలు అన్ని కేంద్రాల్లో కేవలం మధ్యాహ్నం సెషన్‌లో మాత్రమే నిర్వహించారు. ఏలూరు నగరంలోని సిద్ధార్థ క్వెస్ట్ స్కూల్‌లో పరీక్షకు 70 మందికి గాను 63 మంది హాజరు కాగా ఏడుగురు గైర్హాజరయ్యారు. తాడేపల్లిగూడెం వాసవి ఇంజనీరింగ్ కళాశాలలో మధ్యాహ్నం సెషన్‌లో 179 మందికి గాను 158 మంది హాజరు కాగా, శశి ఇంజనీరింగ్ కళాశాలలో 107 మందికి 77 మంది హాజరయ్యారు. భీమవరం విష్ణు ఇంజనీరింగ్ కళాశాలలో 99 మందికి 83 మంది హాజరు కాగా, డీఎన్‌ఆర్ కళాశాలలో మధ్యాహ్నం సెషన్‌లో 100 మందికి 84 మంది హాజరయ్యారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): రేషన్ పంపిణీ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే డీలర్లను తొలగిస్తామని జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎంజే అభిషేక్ గౌడ హెచ్చరించారు. మంగళవారం కలెక్టరేట్‌లో డీలర్ల పనితీరును జేసీ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల ఐవీఆర్‌ఎస్ ఫీడ్‌బ్యాక్, రేషన్ పంపిణీ తదితర విషయాల్లో తక్కువ పనితీరు కనబరిచిన 45 మంది చౌకధరల దుకాణాల డీలర్లతో మాట్లాడారు. ప్రజలకు రేషన్ పంపిణీని సక్రమంగా చేయాలనీ, రేషన్ కోసం వచ్చే వారితో మర్యాదగా ప్రవర్తించాలన్నారు. తక్కువ పనితీరు కనబరిచిన 45 రేషన్ దుకాణాలను సీఎస్ డీటీలు వెంటనే వ్యక్తిగతంగా సందర్శిస్తామన్నారు. సమావేశంలో ఏలూరు జిల్లా పౌర సరఫరాల అధికారి బాబు విలియమ్స్, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ శివరామమూర్తి పాల్గొన్నారు.


